బుల్లెట్ విమానం... వైమానిక రంగంలో విప్లవం తీసుకురానుందా?

  • సరికొత్త డిజైన్ తో చిన్న విమానం
  • తక్కువ ఇంధన వినియోగం
  • ఇతర విమానాలతో పోల్చితే చవక ధర
  • బుల్లెట్ ప్లేన్ ను డిజైన్ చేసిన అమెరికా సంస్థ
  • 2025 నాటికి సిద్ధం
బుల్లెట్ రైళ్లు ఎంత వేగంగా దూసుకెళతాయో అందరికీ తెలుసు. వాటి డిజైన్ కారణంగా అంత వేగం సాధ్యపడుతుంది. ఇప్పుడదే తరహాలో బుల్లెట్ విమానం వస్తోంది. ఒట్టో ఏవియేషన్ అనే అమెరికా స్టార్టప్ కంపెనీ ఈ కొత్త రకం విమానాన్ని రూపొందించింది. దీనికి ఒట్టో సెలెరా 500ఎల్ అని నామకరణం చేసింది.

ఇది చూడ్డానికి కోడిగుడ్డు, గాలిబుడగ, బుల్లెట్ వంటి ఆకారాలు జ్ఞప్తికి తెచ్చేలా ఉంటుంది. రూపురేఖల దృష్ట్యా దీన్ని ఏ ఇతర విమానంతోనూ పోల్చలేం. దీని వాయుగతిక నిర్మాణం (ఏరోడైనమిక్స్) మిగతా విమానాల కంటే భిన్నంగా నిలుపుతుంది. ఇది ముందుకు దూసుకెళుతున్నప్పుడు గాలి దీని ఉపరితలాన్ని చాలా తక్కువ స్థాయిలో నిరోధించేలా డిజైన్ ఉంటుంది. తద్వారా విమానం వేగంగా ప్రయాణించడమే కాదు, ఇంధన వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ఇతర టర్బో ప్రొపెల్లర్ విమానాలతో పోల్చితే నాలుగు నుంచి ఐదు రెట్ల మేర ఇంధనం పొదుపు చేస్తుంది. అదే జెట్ విమానంతో పోల్చితే ఏడు నుంచి ఎనిమిది రెట్ల మేర ఇంధనం పొదుపు చేస్తుందని ఒట్టో ఏవియేషన్ సీఈఓ విలియం ఒట్టో జూనియర్ తెలిపారు. ఈ బుల్లెట్ విమానంలో ఆరుగురు ప్రయాణించే వీలుంది. ఇదే సైజున్న బిజినెస్ క్లాస్ విమానంలో ఒక గంట ప్రయాణించేందుకు 2,100 డాలర్లు ఖర్చవుతుండగా, ఈ ఒట్టో సెలెరా 500ఎల్ విమానంలో ఒక గంట ప్రయాణానికి 328 డాలర్లు ఖర్చవుతుంది.
దీని వేగం గంటకు 460 మైళ్లు. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే ఎక్కడా ఆగకుండా 4,500 మైళ్లు ప్రయాణించగలదు. అమెరికన్ ఏరోస్పేస్ శాస్త్రవేత్త విలియం ఒట్టో సీనియర్ దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఇది తుది మెరుగులు దిద్దుకుంటోంది. 2025 నాటికి వినియోగంలోకి తెచ్చేందుకు ఒట్టో ఏవియేషన్ శ్రమిస్తోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ విమానానికి ఓ డీజిల్ ఇంజిన్ (వీ12) అమర్చారు. సాధారణంగా ఇలాంటి ఇంజిన్లు రేసింగ్ కార్లకు అమర్చుతారు. ఈ విమానం డిజైన్ దృష్ట్యా ఇదే సరైన ఇంజిన్ అని దీని సృష్టికర్తలు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో పర్యావరణ హితం కోరి విద్యుత్ లేదా హైడ్రోజన్ ఇంజిన్ అమర్చాలని వారు భావిస్తున్నారు. ఒక్కో బుల్లెట్ ప్లేన్ ధర 5 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అమెరికా వైమానిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.


More Telugu News