అతడు లేకపోతే నేను బతకలేను.. మా ఇద్దరినీ ఒకటి చేయండి: మైదుకూరులో నిజామాబాద్ జిల్లా యువకుడి వేడుకోలు

  • టిక్‌టాక్‌లో యువకులకు పరిచయం
  • దుబాయ్‌లో పనిచేస్తున్న యువకుడిని మస్కట్ రప్పించి వివాహం
  • స్వదేశం వచ్చాక తనను దూరం పెట్టాడని ఆవేదన
  • పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన
తానంటే ఎంతో ఇష్టమని చెప్పి పెళ్లి చేసుకుని ఇప్పుడు దూరం పెడుతున్నాడంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు కడప జిల్లా మైదుకూరులో హల్‌చల్ చేశాడు. అతడు లేకపోతే తాను బతకలేనని, తమ ఇద్దరినీ ఒకటి చేయాలని వేడుకున్నాడు. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో మస్కట్‌లో పనిచేస్తున్న మైదుకూరు యువకుడితో టిక్‌టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఆపై అది మరింత ‘సన్నిహితంగా’ మారింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. రోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఓ రోజు ‘‘నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వు లేకుండా బతకలేను’’ అని మైదుకూరు యువకుడు చెప్పాడు. మస్కట్ వచ్చేయమని చెప్పాడు. దీంతో ఒక్క క్షణం కూడా ఆలోచించని సాయికుమార్ వెంటనే మస్కట్ వెళ్లిపోయాడు. అక్కడ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత అక్కడి నుంచి స్వదేశం చేరుకున్న తర్వాత అతడు తనకు దూరమయ్యాడని సాయికుమార్ ఆరోపించాడు. అతడు తనతో ఒకలా, తల్లిదండ్రులతో ఒకలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ విషయాన్ని మైదుకూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పాడు. దీంతో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేస్తే యువకుడి బంధువులే తనకు వైద్యం చేయించారని తెలిపాడు. అతడు లేకపోతే తాను బతకలేనని, తమ ఇద్దరినీ కలిపి పుణ్యం కట్టుకోవాలని సాయికుమార్ ప్రాధేయపడుతున్నాడు.


More Telugu News