ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకాతో ప్రయోజనాలు ఎక్కువ: మణిపాల్ ఆసుపత్రి వైద్యుడు

  • స్థానికంగానే రోగనిరోధక శక్తి
  • ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి
  • వ్యాప్తి కూడా తగ్గుతుంది
  • సూది లేకపోవడం కూడా అనుకూలం
కరోనా నివారణకు సంబంధించి ఇంట్రా నాసల్ (ముక్కు లోపలికి) వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రముఖ వైద్య నిపుణుడు, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి సీనియర్ సర్జన్ పీఎస్ వెంకటేశ్ రావు తెలిపారు. సాధారణ టీకాతో పోలిస్తే ఇంట్రా నాసల్ టీకాతో అధిక ప్రయోజనాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

‘‘సిస్టమ్యాటిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ కు బదులు స్థానికంగా వ్యాధి నిరోధక రక్షణ ఏర్పడుతుంది. నాసల్ వ్యాక్సిన్ వల్ల ఏర్పడే లోకల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల ఒక వ్యక్తి కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు వ్యాధి విస్తరణ కూడా తగ్గుతుంది’’ అని డాక్టర్ వెంకటేశ్ వివరించారు.

ముక్కు ద్వారా ఇచ్చే టీకాకు సూది ఉండకపోవడం మరో అనుకూలతగా చెప్పారు. దీనివల్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సూది భయం లేకుండా ఎక్కువ మంది టీకాలు తీసుకునేందుకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ విధానంలో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ మందికి టీకాలు ఇవ్వొచ్చని, ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు. టీకాల కార్యక్రమంలోకి దీన్ని కూడా చేర్చడం ప్రయోజనకరమన్నారు.


More Telugu News