వనమా రాఘవ అరెస్ట్.. ఏపీ వైపు పారిపోతుండగా కాపుకాసి పట్టుకున్న పోలీసులు

  • నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు
  • దమ్మపేట మీదుగా ఏపీకి పరారయ్యే యత్నం
  • చింతలపూడి వద్ద అరెస్ట్
  • నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
  • రాఘవ పంచాయితీ నిజమేనన్న రామకృష్ణ తల్లి
నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మీదుగా వాహనంలో ఏపీ వైపు పరారవుతున్న రాఘవను చింతలపూడి వద్ద గత రాత్రి పదిన్నర గంటల సమయంలో పట్టుకున్నారు. రాఘవను ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం నేడు కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది.

రామకృష్ణ ఆత్మహత్య తర్వాత రాఘవకు సంబంధించిన మరిన్ని అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. పాల్వంచ ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో విచారించేందుకు ఏఎస్పీ ఎదుట శుక్రవారం హాజరు కావాలంటూ గురువారం అర్ధరాత్రి రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు నివాసానికి నోటీసులు అంటించారు. అయితే, పరారీలో ఉన్న రాఘవ హాజరు కాలేదు. మరోవైపు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన టీఆర్ఎస్ పార్టీ రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ఇదిలావుంచితే, కుమారుడి కుటుంబం ఆత్మహత్యపై రామకృష్ణ తల్లి సూర్యవతి స్పందించారు. వనమా కుటుంబానికి, తమకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, అప్పుల విషయంలో రాఘవ పంచాయితీ చేయడం నిజమేనని సూర్యవతి, రామకృష్ణ సోదరి మాధవి తెలిపారు. తన భార్యను రాఘవ పంపమన్నాడని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పిన విషయం తమకు చెప్పలేదని, చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. రామకృష్ణ ఆత్మహత్య చేసుకుంటూ తమ మీద లేనిపోని నిందలు మోపాడని చెప్పారు. మరోపక్క, వనమా రాఘవ పెట్టిన ఇబ్బందులకు తన అల్లుడి కుటుంబం బలైపోయిందని, అతడిని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ అత్త డిమాండ్ చేశారు.


More Telugu News