పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్ జిత్ చన్నీ... రాహుల్ గాంధీ ప్రకటన

  • త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు
  • సీఎం రేసులో చన్నీ, సిద్ధూ
  • చన్నీవైపే మొగ్గు చూపిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • సిద్ధూకు తప్పని నిరాశ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీయే తమ సీఎం అభ్యర్థి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పంజాబ్ లోని లూథియానాలో జరిగిన ఓ వర్చువల్ ర్యాలీలో రాహుల్ ఈ ప్రకటన చేశారు. తద్వారా గత కొన్నిరోజులుగా సాగుతున్న చర్చకు తెరదించారు. అంతేకాదు, సీఎం అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని ఆశించిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆశలపైనా నీళ్లు చల్లారు.

కాగా, పంజాబ్ కాంగ్రెస్ వర్గాల్లో అత్యధికుల అభిప్రాయం మేరకే ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్టు అర్థమవుతోంది. దాంతోపాటే, పంజాబ్ లో దళిత సిక్కుల ఓట్లు 32 శాతం ఉన్నాయి. ఇది కూడా చన్నీని ఎంపిక చేయడానికి ఓ కారణమైంది.

ఇటీవల పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ తప్పుకోవడంతో, కాంగ్రెస్ అధిష్ఠానం చరణ్ జిత్ చన్నీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. చన్నీ తన పనితీరుతో అధిష్ఠానం మనసు చూరగొన్నాడని తాజా నిర్ణయం చెబుతోంది.

రాహుల్ గాంధీ ప్రకటనపై సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ, కాంగ్రెస్ హైకమాండ్ కు, పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదలు తెలియజేశారు. పంజాబ్ ను గత 111 రోజులుగా ఎలా ముందుకు తీసుకెళుతున్నదీ చూశారని, ఇకపైనా పంజాబ్ ను, పంజాబ్ ప్రజలను మరింత పురోగామి పథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News