బీజేపీ మాజీ నేతలను బెంగాల్ ఉప ఎన్నిక బరిలో దించుతున్న మమత

  • అసనాల్ లోక్ సభ స్థానం నుంచి శతృఘ్న సిన్హా
  • బల్లిగుంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బాబుల్ సుప్రియో
  • ట్విట్టర్లో స్వయంగా ప్రకటించిన మమత
  • వీరిద్దరూ బీజేపీ ప్రభుత్వాల్లో మాజీ కేంద్ర మంత్రులు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ మాజీ నేతలను రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ నిర్ణయించారు. 

బాలీవుడ్ నటుడు, 76 ఏళ్ల శతృఘ్న సిన్హా అసనాల్ లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో టీఎంసీ టికెట్ పై పోటీ చేయనున్నారు. అలాగే, గతేడాది పశ్చిమబెంగాల్ ఎన్నికల అనంతరం బీజేపీని వీడి టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియో బల్లిగుంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. వీరి ఎంపికను మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.

అసనాల్ లోక్ సభ ఎంపీగా ఉన్న బాబుల్ సుప్రియో టీఎంసీలో చేరిన తర్వాత తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో సిన్హాకు అవకాశం ఇచ్చారు.

శతృఘ్న సిన్హా 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి.. అక్కడి నుంచి టీఎంసీలోకి జంప్ చేశారు. 13వ లోక్ సభ సమయంలో వాజ్ పేయి ప్రభుత్వంలో ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు. అటు బాబుల్ సుప్రియో సైతం మోదీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారే.

‘‘మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు శ్రీ శతృఘ్న సిన్హా, అసనాల్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో మా అభ్యర్థి అని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తరఫున ప్రకటించడం పట్ల సంతోషిస్తున్నాను.

మాజీ కేంద్ర మంత్రి, మాజీ గాయకుడు బాబుల్ సుప్రియో బల్లిగుంజ్ విధాన సభ స్థానం ఉప ఎన్నికలో మా పార్టీ అభ్యర్థి. జై హింద్, జై మా మాతి మానుష్’’అంటూ మమతా బెనర్జీ రెండు ట్వీట్లు వేశారు.


More Telugu News