నాటో సభ్యత్వంపై మాట మార్చిన జెలెన్ స్కీ.. రష్యాకు నాటో భయపడుతోందని వ్యాఖ్య

  • సభ్యత్వం ఇవ్వాలని జెలెన్ స్కీ డిమాండ్
  • రష్యాకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
  • ప్రజలను చంపి ఆక్రమించుకోవాల్సిందేనని వ్యాఖ్య  
నాటో దేశాలు, కూటమిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. ఇన్నాళ్లూ నాటో సభ్యత్వం తమకు అవసరం లేదని చెప్పిన ఆయన.. ఇప్పుడు మాట మార్చారు. తమను నాటోలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రష్యాకు నాటో కూటమి భయపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తమకు నాటోలో సభ్యత్వం ఇవ్వాలని, లేదంటే రష్యాకు భయపడుతున్నామంటూ నాటో బహిరంగంగా ఒప్పుకోవాలని ఆయన సవాల్ చేశారు. తమకు నాటోలో సభ్యత్వం లేకపోయినా భద్రతకు హామీ ఇచ్చే నాటో దేశాలున్నాయన్నారు. 

ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలన్న రష్యా డిమాండ్ ను ఆయన తోసిపుచ్చారు. ఖర్కివ్, మేరియపోల్, కీవ్ లలో రష్యా అలాంటి డిమాండ్లనే పెడుతోందని, ఒకవేళ వాటిని ఆక్రమించుకోవాలనుకుంటే అక్కడి ప్రజలందరినీ రష్యా చంపాల్సి ఉంటుందని అన్నారు. నాజీల అడుగుల్లో నడుస్తున్న రష్యా.. రివర్స్ లో తమనే నాజీలంటూ ఆరోపిస్తోందని మండిపడ్డారు.


More Telugu News