అమ్మ ఒడి ప‌థ‌కం అమ‌లుపై నారా లోకేశ్ సెటైర్లు

  • అమ్మ ఒడి ప‌థ‌కానికి ఆంక్ష‌ల‌పై లోకేశ్ ఫైర్‌
  • ఈ ఆంక్ష‌ల‌ను ముందే ఎందుకు చెప్ప‌లేద‌ని ప్ర‌శ్న‌
  • అమ్మ ఒడిని అర్థ ఒడిగా మార్చేశార‌న్న లోకేశ్‌
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి ప‌థ‌కం ప్ర‌స్తుత అమ‌లు తీరుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సెటైర్ల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుస ట్వీట్ల‌ను సంధించారు. 'కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుగా ఉంది అమ్మ ఒడి అమ‌లు తీరు' అంటూ లోకేశ్ సెటైర్లు సంధించారు.

తేదీల మ‌త‌ల‌బుతో ఓ ఏడాది ఈ ప‌థ‌కాన్ని ఎగ్గొట్టిన సీఎం జ‌గ‌న్‌... మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ పేరిట అందులో నుంచి రూ.1,000 కోత పెట్టి అమ్మ ఒడిని అర్థ ఒడిగా మార్చార‌ని లోకేశ్ విమ‌ర్శించారు. అర్ధ ఒడిగా మారిన అమ్మ ఒడిపై ఇప్పుడు ఆంక్ష‌ల క‌త్తిని ఎక్కుపెట్టార‌ని కూడా ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. మొత్తంగా ఈ ప‌థ‌కం మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నార్థకంగా మార్చేశార‌ని లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే కట్, ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‍లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి  లాంటి ష‌ర‌తుల‌ను ముందే ఎందుకు చెప్ప‌లేద‌ని లోకేశ్ ప్ర‌శ్నించారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు వేస్తామని సీఎం సతీమణి ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేశార‌న్న లోకేశ్.. అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మ ఒడి ఇవ్వాలని డిమాండ్ చేశారు.


More Telugu News