హైకమాండ్ సూచనల మేరకే నడుచుకుంటున్నా.. తాండూర్ టికెట్ నాదే: మహేందర్ రెడ్డికి రోహిత్ రెడ్డి కౌంటర్

  • ఎమ్మెల్సీ ఆరోపణల్లో నిజంలేదన్న రోహిత్ 
  • ఎవరు గొడవలు చేస్తున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్య
  • తన పక్కన రౌడీషీటర్లెవరూ లేరని స్పష్టీకరణ
  • ఫ్రస్ట్రేషన్ లో ఆరోపణలు చేస్తున్నారంటూ కామెంట్
పోలీసులను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దూషించడం సరికాదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇసుక దందా చేస్తున్నారన్న ఆరోపణల మీద ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారో నియోజకవర్గం మొత్తం తెలుసన్నారు. తన పక్కన రౌడీ షీటర్లు ఎవరూ లేరని, కొందరు కావాలనే ఫ్రస్ట్రేషన్ లో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హైకమాండ్ సూచనల మేరకే తాను నడుచుకుంటున్నానని చెప్పారు. 

ఈ విషయాన్ని పూర్తిగా అధిష్ఠానం దృష్టికి ఇంకా తీసుకెళ్లలేదని, అన్నీ వివరిస్తానని చెప్పుకొచ్చారు. తాను ఏ సర్పంచ్ నూ వేధించలేదని, ఇప్పుడున్న సమస్యను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఓ ప్రక్రియ, సిస్టమ్ ద్వారా మాత్రమే సర్పంచ్ లు సస్పెండ్ అయ్యారన్నారు. వారి సస్పెన్షన్ లో తన పాత్ర లేనే లేదన్నారు. 

తాండూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ప్రజలందరూ తన పనిపట్ల సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. తాండూరుకు తనలాంటివాళ్లు అవసరమన్న ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో అధిష్ఠానం టికెట్ ఇచ్చిందన్నారు. 

తాండూరు టికెట్ తనదేనని, వందకు వంద శాతం తనకే ఇస్తుందని అధిష్ఠానం కూడా చెప్పిందని రోహిత్ రెడ్డి తెలిపారు. 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను కూడా తాను పూర్తి చేశానని చెప్పారు. తన పనితీరుపట్ల అందరూ సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం కూడా తనను ఎన్నో విషయాల్లో మెచ్చుకున్నారని చెప్పారు. ఇటీవలి సర్వేల్లో చాలా మంది తనకే మద్దతిచ్చారని తెలిపారు.


More Telugu News