పెళ్లికార్డులు పంచుతుండగా యువతి కిడ్నాప్.. సామూహిక అత్యాచారం చేసి అమ్మేసిన దుండగులు

  • కొన్ని రోజులపాటు బాధితురాలిని తమతోనే వుంచుకున్న నిందితులు
  • తర్వాత ఓ రాజకీయ పార్టీ నాయకుడికి అప్పగింత 
  • అతడు మధ్యప్రదేశ్‌లోని మరో వ్యక్తి వద్దకు పంపిన వైనం
  • తండ్రికి ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. శుభలేఖలు పంచేందుకు వెళ్లిన 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆపై విక్రయించారు. ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. 

పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 21న బాధిత యువతి వివాహం జరగాల్సి ఉంది. దీంతో 18న పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆమెను తమతోనే ఉంచుకున్న యువకులు అనంతరం ఓ రాజకీయ పార్టీ నేతకు అప్పగించారు. ఆయన కొన్ని రోజులపాటు ఆమెను బంధించాడు.

అనంతరం పక్కనే ఉన్న మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు ఆమెను పంపించాడు. అక్కడి నుంచి ఎలాగోలా తన తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను రక్షించారు. తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై విక్రయించారని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెహరౌలి సర్కిల్ ఆఫీసర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


More Telugu News