మీ కుతంత్రం తెలంగాణలో పారదు.. అమిత్ షాకు 9 ప్రశ్నలు సంధించిన రేవంత్

  • ‘ఛీ’ఆర్ఎస్ తో సావాసమంటూ ఫైర్
  • రాష్ట్ర ఆత్మగౌరవంపై మోదీ దాడి చేశారని మండిపాటు
  • మాటలు కోటలు దాటడం తప్ప చేతల్లేవంటూ రేవంత్ విమర్శ
అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో నిన్న కేటీఆర్ 27 ప్రశ్నలను సంధించారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రికి తొమ్మిది ప్రశ్నలను సంధించి.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఛీ’ఆర్ఎస్ తో సావాసం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవంపై ప్రధాని మోదీ దాడి చేశారని ఆరోపించారు. సెంటిమెంట్, ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనే మీ కుతంత్రం రాష్ట్రంలో పారదని తేల్చి చెప్పారు. 

మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప.. చేతలు చేయడం లేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపవడం అటుంచి వారి పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని విమర్శించారు. బీజేపీ టీఆర్ఎస్ లు 8 ఏళ్లు అంటకాగాయన్నారు. రావాల్సిన పథకాలను తుంగలోకి తొక్కారని ఆరోపించారు. ఈ ప్రశ్నలను సంధించారు...

  • ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని బీజేపీ చీఫ్ కూడా ఆరోపిస్తున్నారు. అయినాగానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని నేతలు ఎదిరిస్తే ఈడీ దాడులు చేయిస్తున్న మీరు.. ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ అవినీతిని ఉపేక్షించడం వెనక ఆంతర్యమేంటి?
  • యాసంగిలో తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయవద్దంటూ కేసీఆర్ తో కలిసి మీరు ఒప్పందం చేసుకున్నారు. బాయిల్డ్ రైస్ అనే వంకను తెరపైకి తెచ్చారు. కేసీఆర్ కొనుగోలు కేంద్రాలనూ ఎత్తేశారు. రైతులు రూ.7 వేల కోట్లు నష్టపోయారు. మీ రెండు పార్టీలు ఆడిన డ్రామా వల్ల పోయిన వానాకాలం నుంచి రైతులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు చనిపోయారు. వారి మరణాలకు మీ రెండు పార్టీలు బాధ్యులు కాదా?
  • పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతికి ధన్యవాద ప్రసంగం సందర్భంగా తెలంగాణపై ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించపరిచేలా కామెంట్లు చేశారు. ఇప్పుడు మీరు తెలంగాణకు వస్తున్నారు కాబట్టి.. వాటికి వివరణ ఇచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మీ రాకను తెలంగాణ ప్రజలు ఎలా ఆమోదిస్తారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేవనుకుంటున్నారా?
  • బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ లో పసుపుబోర్డును ఏర్పాటు చేస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మీ పార్టీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ కూడా రాసిచ్చారు. ఆ మాటలు నమ్మి ప్రజలు గెలిపించినా.. పసుపు బోర్డు ఊసే లేదు. ఇది ప్రజలను వంచించడం కాదా?
  • ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ విభజన సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వాటికి మీరు మంగళం పాడారు. తెలంగాణకు ఏమీ చేయకపోయినా అనేక సందర్భాల్లో కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతిస్తూ వచ్చింది. అలాంటి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? గిరిజన వర్సిటీకి మోక్షం ఎప్పుడు?
  • అయోధ్య నుంచి రామేశ్వరం వరకు రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ‘రామాయణం సర్క్యూట్’ పేరిట శ్రీరామాయణ్ యాత్ర ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు. 7,500 కిలోమీటర్లు సాగే ఈ యాత్రలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద్రి రాముడికి మాత్రం చోటివ్వలేదు. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా మొండి చెయ్యి చూపారు? భద్రాద్రి రాముడు రాముడు కాదా?
  • ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై మా పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర ఉందంటూ ఆ ఆధారాలనూ ఇచ్చాం. దీనిపై విచారణ అతీగతీ లేదు. కేసీఆర్ అవినీతిపై సీరియస్ గానే ఉంటే.. చేతల్లో ఎందుకు కనిపించట్లేదు?
  • పొరుగున ఉన్న అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలోని రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికీ జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? అడిగే బుద్ధి టీఆర్ఎస్ కు ఎలాగూ లేదు. మీ దుర్మార్గ చట్టాలకు వారి మద్దతు. వారి అక్రమాలు, అవినీతికి మీ మద్దతు.. ఇదే కదా ఎనిమిదేళ్లుగా జరిగింది?
  • 2014లో కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ ధర రూ.71.41, డీజిల్ ధర రూ.55.49. గ్యాస్ సిలిండర్ ధర రూ.470. కానీ, ఇప్పుడు పెట్రోల్ రూ.119.66, డీజిల్ 105.65, గ్యాస్ ధర రూ.1,052కు ఎగబాకాయి. సామాన్యుడు బతికే పరిస్థితే లేదు. గ్యాస్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ధరలు పెరుగుతున్నా చీమ కుట్టినట్టయినా లేదు. ధరల్లో బీజేపీ, టీఆర్ఎస్ బాదుతున్న పన్నులే 60 శాతం ఉన్నాయి. ఇలా పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలి?

...ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అమిత్ షా తెలంగాణకు ఎలా వస్తారని రేవంత్ ప్రశ్నించారు. మోసానికి కవల పిల్లల్లాంటి బీజేపీ, టీఆర్ఎస్ ఎత్తు, జిత్తులు గ్రహించలేని అమాయకులనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు? అని నిలదీశారు.


More Telugu News