టీవీని గంటలపాటు చూస్తే గుండె జబ్బులు వస్తాయంటున్న పరిశోధకులు

  • రోజులో నాలుగు గంటలకు పైన చూసే వారికి ఎక్కువ రిస్క్
  • అర గంటలోపు చూసే వారికి రిస్క్ లేనట్టే
  • కేంబ్రిడ్జ్ వర్సిటీ పరిశోధనలో వెల్లడి
  • చలనం లేని జీవితం మంచిది కాదంటున్న నిపుణులు
టీవీ కార్యక్రమాలను గంటలపాటు చూసే అలవాటు ఉన్నవారు.. వెంటనే దీన్ని మానుకుంటే మంచిదేమో! అదేపనిగా టీవీ ముందు తిష్ట వేసుకుని కూర్చోవడం వల్ల గుండె జబ్బుల బారిన పడతారని నూతన అధ్యయనం ఒకటి వెల్లడించింది. కరోనరీ గుండె జబ్బులు వస్తాయని పరిశోధకులు తెలుసుకున్నారు.

స్క్రీన్ ను చూస్తూ కదలికలు లేకుండా జీవనం గడిపేవారికి (టీవీ, కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్) గుండె జబ్బుల రిస్క్ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు.

ఇక రోజులో అరగంటలోపు టీవీ చూసే వారు 11 శాతం మేర గుండె జబ్బుల రిస్క్ ను నివారించుకోవచ్చని వీరు చెప్పారు. రోజులో నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూసే వారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని వీరు గుర్తించారు. వీరితో పోలిస్తే రోజులో మూడు గంటలు అంతకంటే తక్కువ సమయం చూసే వారికి 6 శాతం తక్కువ రిస్క్ ఉంటుందని తెలుసుకున్నారు. గంటలోపు చూసే వారికి 16 శాతం తక్కువ రిస్క్ ఉంటోంది. 

ఐదు లక్షల మందికి పైగా ప్రజలపై ఈ అధ్యయనాన్ని పరిశోధకులు నిర్వహించారు. వివిధ జెనెటిక్ వర్గాలకు చెందిన వారు ఇందులో ఉండేలా చూశారు. టీవీ అనే కాకుండా నిశ్చలమైన జీవనం గడిపే వారికి గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. వైద్యులు కూడా తమ వద్దకు వచ్చే రోగులను ఈ విషయమై హెచ్చరిస్తుంటారు. 



More Telugu News