ఈడీ విస్తృత అధికారాల స‌మీక్ష‌కు ఓకే చెప్పిన‌ సుప్రీంకోర్టు

  • ఇటీవ‌లే ఈడీ విస్తృత అధికారాల‌పై స‌మీక్ష అవ‌స‌రం లేద‌న్న సుప్రీంకోర్టు
  • తాజాగా ఆ తీర్పుపై మ‌రో పిటిష‌న్ వేసిన కార్తీ చిదంబ‌రం
  • పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ధ‌ర్మాస‌నం
  • ఈడీ అధికారాల్లోని రెండు అంశాల‌పై స‌మీక్ష అవ‌స‌ర‌మ‌న్న సీజేఐ
దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌నే ఛిన్నాభిన్నం చేసే అవకాశ‌మున్న మ‌నీ ల్యాండ‌రింగ్ కేసుల దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)కి విస్తృత అధికారాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈడీ అధికారాల‌పై స‌మీక్ష చేయాలంటూ ఇటీవ‌లే దాఖ‌లైన పిటిష‌న్ల‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు... తీవ్ర‌మైన ఆర్థిక నేరాల‌ను ద‌ర్యాప్తు చేస్తున్న ఈడీకి ఆ త‌ర‌హాలో విస్తృత అధికారాలు స‌మంజ‌సమేనంటూ తేల్చి చెప్పింది. 

అయితే ఇది జ‌రిగి నెల కూడా గ‌డ‌వ‌క‌ముందే.. ఇదే వ్య‌వ‌హారంపై దాఖ‌లైన ఓ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు... ఈడీ విస్తృత అధికారాల స‌మీక్ష జ‌ర‌గాల్సిందేన‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం గురువారం ఓ కీల‌క వ్యాఖ్య చేసింది.

గ‌త నెల‌లో జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఖ‌న్విల్క‌ర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌... ఈడీ విస్తృత అధికారాల‌పై స‌మీక్ష అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పింది. తాజాగా ఈ తీర్పును స‌వాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత కార్తీ చిదంబ‌రం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ‌కు స్వీక‌రించింది. 

గురువారం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌గా... ఈడీ అన్ని అధికారాల‌పై స‌మీక్ష అవ‌స‌ర‌మని కార్తీ త‌ర‌ఫు న్యాయవాది క‌పిల్ సిబ‌ల్ తెలిపారు. అయితే ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది తుషార్ మెహ‌తా మాత్రం అందుకు స‌మ్మ‌తించ‌లేదు. ఏదేనీ ప్ర‌త్యేక అంశంపై అయితే త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని మెహ‌తా తెలిపారు.

దీంతో ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్‌)ను నిందితుల‌కు ఇవ్వ‌క‌పోవ‌డం, నిందితుల అమాయ‌కత్వాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డాన్ని తిర‌స్క‌రించే అంశాల‌ను స‌మీక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ రెండు అంశాలు మిన‌హా ఈడీకి ద‌క్కిన విస్తృత అధికారాల‌ను స‌మీక్షించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు.


More Telugu News