జులైలో రూ.1.49 ల‌క్ష‌ల‌ కోట్ల జీఎస్టీ... వ‌రుస‌బెట్టి ఐదో నెల‌లోనూ రూ.1.40 ల‌క్ష‌ల‌ కోట్లు దాటిన‌ వ‌సూళ్లు

  • జీఎస్టీ వసూళ్ల‌పై బీజేపీ ట్వీట్‌
  • అత్య‌ధిక జీఎస్టీ వసూళ్ల‌లో ఈ జూలై వ‌సూళ్లకు రెండో స్థానం
  • గ‌తేడాదితో పోలిస్తే 28 శాతం పెరిగిన వ‌సూళ్లు
దేశంలో గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వ‌సూళ్లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో వ్యాపార కార్య‌క‌లాపాలు పూర్తిగా మంద‌గించిన నేప‌థ్యంలో జీఎస్టీ వ‌సూళ్లు భారీగా త‌గ్గిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌గానే దేశంలో వ్యాపార కార్య‌క‌లాపాలు ఒక్క‌సారిగా ఊపందుకున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నంగా క్ర‌మంగా జీఎస్టీ వ‌సూళ్లు పెరుగుతున్నాయి. జులై మాసంలో రూ1.49 ల‌క్ష‌ల‌ కోట్ల మేర జీఎస్టీ వ‌సూల‌యింది. 

గ‌తేడాది ఇదే మాసంతో పోలిస్తే.. ఈ వ‌సూళ్ల‌లో ఏకంగా 28 శాతం మేర వృద్ధి న‌మోదైంది. గ‌తేడాది జులై మాసంలో రూ.1.16 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే వ‌సూలైంది. ఇదిలా ఉంటే... జీఎస్టీ నెల‌వారీ వ‌సూళ్లూ రూ.1.40 ల‌క్ష‌ల కోట్లు దాట‌డం జులై నెలతో ఐదో నెల కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా అత్య‌ధిక జీఎస్టీ వ‌సూళ్ల‌లో ఈ జులై మాసం వ‌సూళ్లు రెండో స్థానంలో నిలిచింది. ఈ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... దేశంలో వ్యాపార కార్య‌క‌లాపాలు క్ర‌మంగా వృద్ధి చెందుతున్న వైనానికి నిద‌ర్శ‌న‌మ‌ని ట్వీట్ చేసింది.


More Telugu News