పేరెంట్స్ క్లబ్ లోకి నయన్, విఘ్నేశ్ కు ఆహ్వానం: కాజల్ అగర్వాల్
- గర్భాన్ని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులుగా మారిన నయన్, విఘ్నేశ్
- చాలా చాలా శుభాకాంక్షలు అంటూ కాజల్ అగర్వాల్ పోస్ట్
- పెళ్లయిన నాలుగు నెలలకే పుత్రోత్సాహం
నయనతార, విఘ్నేశ్ శివన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ నడుస్తోంది. పెళ్లయిన సరిగ్గా నాలుగు నెలలకే వీరు తల్లిదండ్రులు అయ్యారు. అక్టోబర్ 9న సరోగసీ విధానంలో (వేరొకరి గర్భం సాయంతో) కవలలకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జూన్ 9న చెన్నైలో నయన్, విఘ్నేశ్ వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లికి ముందే పిల్లలకు ప్లాన్ చేసుకోవడంపై వీరిని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తుంటే, కొందరు తల్లిదండ్రులైన ఈ జంటను శుభాకాంక్షలతో అభినందిస్తున్నారు. నటి కాజల్ అగర్వాల్ కూడా తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో శుభాకాంక్షలు తెలియజేసింది.
‘‘నయన్ మరియు వికీకి చాలా చాలా శుభాకాంక్షలు. పేరెంట్స్ క్లబ్ లోకి ఆహ్వానం. కచ్చితంగా జీవితంలో ఇది ఉత్తమ దశ అవుతుంది. ఉయిర్, ఉలగమ్ కు నా నుంచి ఎంతో ప్రేమ, దీవెనలు’’ అంటూ కాజల్ అగర్వాల్ పోస్ట్ పెట్టింది. నయన్, విఘ్నేశ్ 2015 నుంచి ప్రేమలో ఉన్నారు. డేటింగ్ తో మరింత దగ్గరై, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం తెలిసిందే.