వైసీపీ గర్జనను అడ్డుకోవడానికే పవన్ కల్యాణ్ విశాఖ వస్తున్నాడు: రోజా మండిపాటు

  • అక్టోబరు 15న విశాఖలో వైసీపీ గర్జన
  • అదే రోజున పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభం
  • ప్రజలను పక్కదారి పట్టించేందుకు పవన్ వస్తున్నాడని రోజా విమర్శలు
విశాఖ గర్జన పేరుతో వైసీపీ రేపు (అక్టోబరు 15) వైజాగ్ లో భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది. వికేంద్రీకరణకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. విశాఖలో అంబేద్కర్ విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.

అయితే, అక్టోబరు 15 నుంచి మూడ్రోజుల పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించారు. దీనిపై ఏపీ టూరిజం, క్రీడలు, యువజన శాఖ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. వైసీపీ గర్జనను పక్కదారి పట్టించేందుకే పవన్ విశాఖలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబుకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ దత్తపుత్రుడు నేనున్నానంటూ వస్తాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా విశాఖ గర్జనను తన పిచ్చిమాటలతో పక్కదారి పట్టించేందుకు వస్తున్నాడని రోజా విమర్శించారు. విశాఖలో రాజధాని అనేది ప్రజల సెంటిమెంటుకు సంబంధించిన విషయం అని, ఎవరో వచ్చి పక్కదారి పట్టిస్తే సమసిపోయే విషయం కాదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు రాజధాని కావాలని ప్రజలు, నేతలు అందరూ ఒక్కతాటిపైకి వచ్చారని, పవన్ కల్యాణ్ కుప్పిగంతులు వారిముందు పనిచేయవని అన్నారు. 

వేలు, లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల కష్టాల గురించి పుస్తకాలు చదవలేదా? అని రోజా ప్రశ్నించారు. అప్పట్లో విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాల్సిందని కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య కూడా అన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు బాగా వెనుకబడ్డాయని, వాటిని అభివృద్ధి చేసేందుకే సీఎం జగన్ వికేంద్రీకరణ తీసుకువస్తున్నారని రోజా వివరించారు. తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఉత్తరాంధ్ర గర్జనకు తాను మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఆస్తుల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం అమరావతిలోనే రాజధాని ఉండాలంటున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతాడని రోజా వ్యాఖ్యానించారు. 

అమరావతి కోసం ఒంటికాలి జపం చేస్తూ, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. అమరావతి నుంచి ఉత్తరాంధ్రకు పాదయాత్ర కోసం పెయిడ్ ఆర్టిస్టులను, దొంగ రైతులను పంపించాడని ఆరోపించారు. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉందని, స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనం అని రోజా పేర్కొన్నారు. 

అటు, బాలయ్య అన్ స్టాపబుల్-2 షో పైనా రోజా స్పందించారు. ఆ ఎపిసోడ్ కు చంద్రబాబు హాజరు కాగా, దీనిపై రోజా మాట్లాడుతూ, మొన్న ఒక కార్యక్రమం చూశానని, బావబావమరుదులు అన్ స్టాపబుల్ గా అబద్ధాలు చెప్పారని వ్యంగ్యంగా అన్నారు. "ఆ రోజున మీరు (బాలకృష్ణ) కూడా మాతో ఉన్నారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని ఏడ్చాను... అయినా ఆయన వినలేదు. నేను చేసింది తప్పా?" అని చంద్రబాబు అడగడం చూస్తుంటే ప్రజలను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నట్టుందని రోజా విమర్శించారు. 

పచ్చమీడియా ద్వారా చెబితే ప్రజలు నమ్మడంలేదు కాబట్టి, వేరే ఎంటర్టయిన్ మెంట్ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇవన్నీ నమ్మడానికి ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదని, వీళ్లు తింగరోళ్లు అనుకుంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఒక ప్రోమో వస్తేనే ఎన్ని వివాదాలు వచ్చాయో అందరికీ తెలిసిందేనని, ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవం అని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రోజా విమర్శించారు.


More Telugu News