యూట్యూబ్ లో ఇక మీకు నచ్చిన కోర్స్ నేర్చేసుకోవచ్చు!

  • 2023లో మొదలు కానున్న యూట్యూబ్ లెర్నింగ్
  • కంటెంట్ క్రియేటర్లు, అభ్యాసకులకు ఉమ్మడి వేదిక
  • బైజూస్, అన్ అకాడమీ వంటి సంస్థలకు గట్టి పోటీ
గూగుల్ కు చెందిన యూ ట్యూబ్ ఇప్పుడు విద్యా సంబంధిత వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. ‘యూట్యూబ్ లెర్నింగ్’ పేరుతో కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్, ఆకాశ్, అన్ అకాడమీ తదితర సంస్థలకు యూట్యూబ్ గట్టి పోటీనివ్వనుంది. ఎందుకంటే యూట్యూబ్ దాదాపు ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంటుంది. కనుక మిగిలిన సంస్థలతో పోలిస్తే ఎక్కువ మందిని చేరుకోగలదు.

సబ్ స్క్రిప్షన్ విధానంలో యూట్యూబ్ కోర్సులను ఆఫర్ చేయనుంది. అంటే చందా చెల్లించడం ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. నిపుణులు అందించే కంటెంట్ ను యూట్యూబ్ ద్వారా చూసి నేర్చుకోవచ్చు. భాగస్వాములు, కంటెంట్ క్రియేటర్లతో ఒప్పందం చేసుకుని కోర్సులను యూట్యూబ్ ఆఫర్ చేయనుంది. ఈ సేవలు 2023 మొదటి ఆరు నెలల్లోనే అందుబాటులోకి రానున్నాయి. 

యూట్యూబ్ కోర్సుల ఆవిష్కరణపై గూగుల్ అధికారికంగా ప్రకటన చేయలేదు. యూట్యూబ్ ఎండీ ఇషాన్ జాన్ ఛటర్జీ అనధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తొలుత భారత్, దక్షిణ కొరియా, అమెరికాలో యూట్యూబ్ కోర్సులను ప్రారంభిస్తామని చెప్పారు. డిజిటల్ లెర్నింగ్ విభాగంలో భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉందన్నారు. సరైన కంటెంట్, నైపుణ్యాలను యూట్యూబ్ ద్వారా సులభంగా నేర్చుకునే విధంగా కోర్సులు ఉంటాయని చెప్పారు. డిజిటల్ వేదికగా తమ కంటెంట్ ను విక్రయించాలనుకునే కంటెంట్ క్రియేటర్లకు వేదిక కల్పిస్తామని ఛటర్జీ తెలిపారు. 



More Telugu News