తనతో కలిసి పాదయాత్ర చేయాలంటూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపిస్తున్న వైఎస్ షర్మిల

  • రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న షర్మిల 
  • సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • తన చివరి దశ పాదయాత్రను ప్రారంభించిన షర్మిల
వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూట్లను బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. అవి వేసుకొని రాష్ట్రంలో తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని ఆమె సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవంటున్న సీఎం కేసీఆర్ అది నిజం అని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నిజం కాకపోతే సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తన పాదయాత్ర ఆగిన స్థలం నుంచి షర్మిల తిరిగి యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాదారు.  

‘సీఎం కేసీఆర్ ఇది బంగారు తెలంగాణ అని, ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఆయన నాతో పాటు పాదయాత్రలో నడవాలని షూ బాక్స్ పంపిస్తున్నా. ఆయన చెప్పినట్టు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని చూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇది నిజం కాకపోతే, కేసీఆర్ రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి" అన్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం దళితుడిని సీఎంను చేయాలని షర్మిల సవాల్ విసిరారు. కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి సీఎం అయ్యారని, కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. ఇక తన పాదయాత్ర నిలిచిన చోటు నుంచి చివరి దశ యాత్ర తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలిపారు.


More Telugu News