కొవిడ్ లక్షణాలతో ఫ్లూ కేసులు.. ఇష్టమొచ్చినట్టు మందులు వాడొద్దు: ఐసీఎంఆర్, ఐఎంఏ

  • దగ్గు, జలుబు, జ్వరంతో వస్తున్న ఇన్ ఫ్లూయెంజా కేసులు
  • పెరుగుతున్న హాస్పిటలైజేషన్
  • జ్వరం, ఒళ్లు నొప్పులకు పారాసిటమాల్ తీసుకోవచ్చని ఐసీఎంఆర్ సూచన
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా లక్షణాలతో పోలిన ఫ్లూ కేసులు నమోదవుతున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) విడివిడిగా ప్రకటన విడుదల చేశాయి. ఇన్ ఫ్లూయెంజా ఏ ఉపరకమైన హెచ్3ఎన్2 గడిచిన రెండు మూడు నెలలుగా బాగా వ్యాప్తిలో ఉందని, ఇతర ఉపరకాలతో పోలిస్తే హెచ్3ఎన్2 కారణంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య అధికంగా ఉంటోందని ఐసీఎంఆర్ తెలిపింది. ఫ్లూ లక్షణాలు, జ్వరం కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై ఐసీఎంఆర్, ఐఎంఏ పలు సూచనలు చేశాయి. 

  • ఫ్లూ లక్షణాలతోపాటు, జ్వరం వస్తే మూడు రోజులు వేచి చూడాలి. జ్వరం మూడు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. దగ్గు మూడు వారాల వరకు కొనసాగొచ్చు. అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు. 
  • ఈ వైరల్ కేసులు ఎక్కువగా 15-50 ఏళ్ల వయసులోపు వారిలోనే కనిపిస్తున్నాయి. జ్వరం, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది. లక్షణాలు తగ్గడానికి మందులు ఇవ్వాలే కానీ, యాంటీబయాటిక్స్ వద్దని వైద్యులకు ఐఎంఏ సూచించింది. 
  • చేతులను సోప్ నీటితో కడుక్కుకోవాలి. ముఖానికి మాస్క్ లు ధరించాలి. రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దు. 
  • జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే పారాసిటమాల్ వేసుకోవచ్చు. 
  • ముక్కు, కళ్లను చేతులతో తాకొద్దు. నీరు తగినంత తీసుకోవాలి. 
  • దగ్గు, తుమ్ములు వచ్చే సమయంలో ముక్కు, నోటికి ఏదైనా అడ్డు పెట్టుకోవాలి. 
  • ఎదుటివారిని షేక్ హ్యాండ్ తో పలకరించొద్దు. 
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు.
  • వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయాటిక్స్ వాడుకోవద్దు.
  • సామూహిక భోజనాలకు దూరంగా ఉండాలి.


More Telugu News