మంచంపై ఆరడుగుల పామును చూసి ఆస్ట్రేలియా మహిళ షాక్

  • దుప్పటి కింద దర్జాగా పడుకున్న పాము
  • తలుపులు మూసి పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసిన మహిళ
  • ఆస్ట్రేలియాలోనే అత్యంత విషపూరిత పాముల్లో ఇదొకటి
  • క్షేమంగా అడవిలో వదిలిపెట్టిన స్నేక్ క్యాచర్
రాత్రంతా హాయిగా నిద్రించిన బెడ్ మీద తెల్లారి ఓ పాము కనిపిస్తే.. అదీ దేశంలోనే అత్యంత విషపూరితమైన పాము అయితే? కాసేపు గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదా! ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళకు ఇలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది. అయితే, ఆ షాక్ నుంచి తొందరగానే తేరుకుని సమయస్ఫూర్తితో వ్యవహరించింది. తన ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు ఆ పామును భద్రంగా అడవికి సాగనంపింది. క్వీన్స్ లాండ్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు..

క్వీన్స్ లాండ్ కు చెందిన మహిళ ఒకరు సోమవారం ఉదయం తన బెడ్రూం సర్దేందుకు ప్రయత్నిస్తుండగా పాము కనిపించింది. బెడ్ పైన బ్లాంకెట్ కింద దర్జాగా పడుకున్న పామును చూసి అదిరిపడింది. వెంటనే బెడ్ రూం బయటికి వచ్చి తలుపు పెట్టేసింది. పాము బయటకు రాకుండా డోర్ కింద టవల్ ను అడ్డుపెట్టింది. ఆపై పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించింది.

జాచెరీస్ స్నేక్ అండ్ రెప్టైల్ రీలోకేషన్ యజమాని జాచెరీ రిచర్డ్స్ ఈ పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈస్టెర్న్ బ్రౌన్ స్నేక్ గా వ్యవహరించే ఈ పాము ఆస్ట్రేలియాలోని అత్యంత విషపూరితమైన వాటిలో ఒకటని రిచర్డ్స్ చెప్పారు. ఇది కనక కాటువేస్తే గుండె, ఊపిరితిత్తులు, నరాలు స్తంభించిపోయి నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోతాయని చెప్పారు.


More Telugu News