అమితాబ్ బచ్చన్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి

  • ఆమ్వే లాంటి సంస్థలను ప్రోత్సహించొద్దంటూ సోషల్ మీడియాలో సజ్జనార్ వినతి
  • దేశఆర్థిక వ్యవస్థను ఆ సంస్థలు నాశనం చేస్తున్నాయని ఆరోపణ
  • అమితాబ్ సహా సెలబ్రిటీలను ఉద్దేశించి ట్వీట్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా సెలబ్రిటీలకు కీలక అభ్యర్థన చేశారు. ఆమ్వే లాంటి సంస్థలను ప్రోత్సహించొద్దంటూ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సహా సెలబ్రిటీలు అందరినీ ట్విట్టర్ వేదికగా కోరారు. ఆమ్వే లాంటి మోసపూరిత సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి సహకరించొద్దని సెలబ్రిటీలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దేశ సామాజిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న ఇలాంటి సంస్థలను ప్రమోట్ చేయవద్దని అభ్యర్థించారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే, సజ్జనార్ గతంలోనూ సెలబ్రిటీలకు ఇలాంటి సూచనలు చేశారు. క్యూనెట్ లాంటి గొలుసుకట్టు సంస్థలను ప్రోత్సహించవద్దంటూ అప్పట్లో ఆయన సూచించారు. 

ఇక అమెరికాకు చెందిన ఆమ్వే కంపెనీ ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించి పలు ఉత్పత్తులను విక్రయిస్తుంటుంది. అయితే, ఆమ్వే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్‌కు పాల్పడుతోందని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతేడాది ఏప్రిల్‌‌‌లో ఆరోపించింది. సంస్థ అసలు లక్ష్యం ఉత్పత్తుల అమ్మకాలు కాదని, గొలుసుకట్టు స్కీముల్లో ప్రజలను చేర్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అప్పట్లో ఈడీ ఆమ్వేకు చెందిన సుమారు రూ.757 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది.


More Telugu News