హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా పోర్ట్ పెట్టుకోవచ్చు..!

  • సేవలు నచ్చకపోయినా, ఫీచర్లు నచ్చకపోయినా సరే
  • ఏ కారణంతో అయినా కంపెనీని మారిపోవచ్చు
  • రెన్యువల్ కు 60 రోజుల ముందుగా కొత్త కంపెనీని సంప్రదించాలి
టెలికం ఆపరేటర్ సేవలు, చార్జీలు నచ్చనప్పుడు మొబైల్ నంబర్ ను పోర్ట్ పెట్టుకుని వేరొక కంపెనీకి సులభంగా మారిపోవడం అందరికీ తెలుసు. అత్యంత విజయవంతమైన పోర్టింగ్ సర్వీసుగా దీనికి పేరు. అయితే, చాలా మందికి తెలియని మరొక పోర్టింగ్ సర్వీసు కూడా ఉంది. అది హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ. జీవిత బీమా ప్లాన్లకు ఈ సదుపాయం లేదు కానీ, ఆరోగ్య బీమాకు ఎప్పటి నుంచో ఉంది. 

ఎందుకు పోర్టింగ్..?
ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్న కంపెనీ విషయంలో అసంతృప్తి గా ఉన్నారా? ప్రస్తుత కంపెనీ ఆఫర్ చేస్తున్న కవరేజీ తక్కువగా ఉండి, ప్రీమియం ఎక్కువగా ఉందా..? క్లెయిమ్ పెట్టుకుంటే అకారణంగా తిరస్కరించిందా..? క్లెయిమ్ కు సత్వర ఆమోదం తెలపకుండా జాప్యం చేసిందా? ప్రస్తుతం కలిగి ఉన్న హెల్త్ ప్లాన్ లో ఫీచర్లు ఆకర్షణీయంగా లేవా..? వేరొక కంపెనీలో ఇంతకు మించి మెరుగైన ఫీచర్లు, మరిన్ని వ్యాధులకు కవరేజీతో తక్కువ ప్రీమియంకే ప్లాన్ అందుబాటులో ఉందా..? ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు పోర్ట్ ద్వారా కంపెనీని మార్చుకోవచ్చు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాల్సినది ఏమిటంటే.. వేరొక కంపెనీలో ఎంపిక చేసుకునే ప్లాన్ ప్రస్తుత ప్లాన్ కంటే మెరుగైన కవరేజీతో, మెరుగైన సేవలతో ఉన్నప్పుడే పోర్టింగ్ ఫలితాన్నిస్తుంది.

ఎలా పోర్టింగ్?
నిబంధనల మేరకు ప్రస్తుతం కలిగి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రెన్యువల్ తేదీకి 45 రోజుల నుంచి 60 రోజుల ముందు.. కొత్త కంపెనీని సంప్రదించాలి. అంటే మీరు మారిపోదామని అనుకుంటున్న కంపెనీని సంప్రదించాలి. నూతన కంపెనీ వద్ద పోర్టబుల్ అప్లికేషన్, ప్రపోజల్ పత్రాన్ని పూర్తి చేయాలి. కొత్త ప్లాన్ తీసుకున్నట్టుగానే ఆరోగ్య సంబంధిత సమాచారం, కేవైసీ డాక్యుమెంట్లు అందించాలి. నూతన సంస్థ కోరిన ఇతర వివరాలు కూడా ఇవ్వాలి. అప్పటి నుంచి 15 రోజుల్లోగా కొత్త కంపెనీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే పాలసీ మంజూరు చేస్తుంది. 45 ఏళ్లు దాటి, అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే పూర్తి స్థాయి వైద్య పరీక్షలకు వెళ్లాలని బీమా సంస్థ కోరుతుంది. కొత్త కంపెనీ పాలసీ ఇచ్చేందుకు తిరస్కరిస్తే.. అప్పుడు పాత కంపెనీతోనే ప్రీమియం చెల్లించి కొనసాగొచ్చు.


More Telugu News