ముఖ్యమంత్రి పదవి అంశాన్ని అధిష్ఠానం నిర్ణయానికే వదిలేశాం: డీకే శివకుమార్

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నా బాధ్యత నేను నిర్వర్తించానని శివకుమార్ వ్యాఖ్య
  • వన్ లైన్ తీర్మానాన్ని ఆమోదించామని తెలిపిన కాంగ్రెస్ చీఫ్
  • ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకోలేదని వ్యాఖ్య
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను తన బాధ్యతను నిర్వర్తించానని, ఇప్పుడు పార్టీ అధిష్ఠానం ఏం చేయాలో చెబుతుందని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. తాము వన్ లైన్ తీర్మానాన్ని ఆమోదించామని, దాని ప్రకారం పార్టీ అధిష్ఠానానికి వదిలేశామని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకోలేదన్నారు. తాను చేయాల్సింది చేశానని ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ విలేకరులతో అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ సీఎం పదవి ఎంపికను అధిష్ఠానానికి వదిలేసింది. 2013-18 కాలంలో కర్ణాటక సీఎంగా పనిచేసిన అనుభవం సిద్ధరామయ్యకు ఉండగా, శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఇదే తొలిసారి అవుతుంది.

సిద్ధరామయ్యను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా చెబుతారు. అందుకే సిద్ధూకి ఆయన మద్దతు ఉందని చెబుతారు. అయితే శివకుమార్... పార్టీకి ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచారు. గాంధీ కుటుంబానికి, ముఖ్యంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సన్నిహితంగా ఉంటారు.


More Telugu News