వెనుకబడిన వర్గాల వాళ్లం కాదు.. బలం ఉన్న వాళ్లం: యనమల రామకృష్ణుడు

  • ‘బీసీల ఐక్యత వర్ధిల్లాలి’ అనే నినాదం నిజం చేయాలన్న యనమల
  • ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, కులాల వారీగా విడిపోతే ఏం చేయలేమని వ్యాఖ్య
  • చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్
‘బీసీల ఐక్యత వర్ధిల్లాలి’ అనే నినాదం నిజం చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. ‘‘మనం వెనుకబడిన వర్గాల వాళ్లం కాదు. చాలా బలమైన సంఖ్యా బలం ఉన్న వాళ్లం. వెనుకబడిన వర్గంగా ముద్ర వేసుకొని.. వెనుకబడిపోవద్దు’’ అని సూచించారు. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, కులాల వారీగా విడిపోతే ఏం చేయలేమని చెప్పారు.

ఆదివారం గుంటూరులో జరిగిన జోన్-3 బీసీ ఐక్యకార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశంలో యనమల మాట్లాడారు. ‘‘ప్రతి కులానికి సమస్యలు ఉంటాయి. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. భారత దేశంలో బీసీలు ఎంత మంది ఉన్నారనేది తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’ అని చెప్పారు. 

ఎక్కువ జనాభా ఉన్న వారికి తక్కువ పదవులు ఉన్నాయని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని యనమల డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో మాదిరిగా చట్టసభల్లో రిజర్వేషన్ తేవాలని అన్నారు. బీసీలు చట్టసభల్లో ఉంటేనే నిధులు, విధుల గురించి పోరాటం చేసే అవకాశం ఉంటుందన్నారు. నిధులు లేక బీసీ కులాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, కుల వృత్తులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News