ఈయన వస్తుంటే లేచి నిలుచోవాలట!: మంత్రి జోగి రమేశ్ తీరుపై అచ్చెన్న విమర్శలు

  • విజయవాడలో నీటి పారుదల సలహా మండలి సమావేశం
  • సభికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జోగి రమేశ్
  • ప్రజలను బానిసలుగా భావిస్తున్నాడని అచ్చెన్న వ్యాఖ్యలు
  • ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపు
ఉమ్మడి కృష్ణా జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి జోగి రమేశ్ సభికులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈయన వస్తుంటే లేచి నిలుచోవాలట... వార్నింగ్ లు ఇస్తున్నాడు అంటూ మండిపడ్డారు. 

తన పదవి తనకు ప్రజలు పెట్టిన భిక్ష అని మరిచి, తాను ప్రజలకు సేవకుడిని అన్న విషయం మరిచి... ప్రజలే తనకు సేవకులు, బానిసలుగా భావిస్తున్న ఇతడు "నేను మంత్రిని... నేను వస్తే మీరు లేచి నిలుచోవాలి అంటూ ప్రజల్నే బెదిరిస్తున్నాడు" అని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఇటువంటి వారందరికీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. 

విజయవాడలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జోగి రమేశ్... సభికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నేను మంత్రిని... నేను, కలెక్టర్ వేదిక మీదికి వస్తున్నాం... జ్ఞానం ఉందా... మైండిట్... ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోండి" అంటూ మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా హెచ్చరించారు.


More Telugu News