తమిళనాడులో కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

  • గత రాత్రి చెన్నైలో భారీ వర్షం
  • మీనంబాకంలో రికార్డుస్థాయిలో 137.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
  • నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై వ్యాప్తంగా గత రాత్రి భారీ వర్షం కురిసింది. నిన్న ఉదయం 8.30 నుంచి నేటి ఉదయం 5.30 గంటల మధ్య మీనంబాకం‌లో రికార్డుస్థాయిలో 137.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు కూడా తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.

కాంచీపురం, చెంగల్పట్టు, తిరువన్నామలై, కళ్లకురిచి, విల్లుపురం, కడలూర్, మైలాదుతురై, నాగపట్టణం, తిరువారూర్, తంజావూర్, తిరుచ్చి, అరియలూర్, పెరంబలూర్‌తోపాటు పుదుచ్చేరి, కరైకుల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్, రాణిపేట్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.


More Telugu News