విమానం టైరుకు మంటలు.. 11 మందికి గాయాలు..త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

  • హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగు చూసిన ఘటన
  • లాస్ యాంజెలెస్‌కు బయలుదేరిన క్యాథే పసిఫిక్ విమానంలో లోపాన్ని గుర్తించిన పైలట్
  • టేకాఫ్ ప్రక్రియకు మధ్యలోనే ముగింపు, ప్రయాణికులను అత్యవసరంగా దింపేసిన వైనం
  • స్లైడ్స్‌మీద జారుతూ కిందకు దిగిన ప్రయాణికుల్లో కొందరికి గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
హాంగ్‌కాంగ్ ఎయిర్‌పోర్టులో ఇటీవల పెను ప్రమాదం తప్పిపోయింది. లాస్ యాంజెలిస్‌కు బయలుదేరిన క్యాథే పసిఫిక్ విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన వెంటనే పైలట్ టేకాఫ్‌ ప్రక్రియను మధ్యలోనే ముగించాడు. తరువాత విమానం నుంచి ప్రయాణికులను అత్యవసరంగా కిందకు దించే సమయంలో 11 మంది గాయపడ్డారు. స్లైడ్స్‌పై జారుతూ కిందకు దిగే ప్రయత్నంలో గాయపడ్డారు. వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకూ తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు. 

కాగా, విమానంలో లోపం ఏమిటనేది ఎయిర్‌లైన్స్ పూర్తి స్థాయిలో వివరించలేదు. అయితే, విమానం టైరు మంటల్లో చిక్కుకోవడం తాము చూశామని కొందరు మీడియాకు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 17 మంది సిబ్బంది, 293 మంది ప్రయాణికులు ఉన్నారు. ‘‘మా అందరికీ భయం వేసింది. విమానం దిగిపోవాలని పైలట్ చెప్పడంతో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు భయంతో కేకలు వేశారు. మేమందరం తీవ్ర ఆందోళనకు లోనయ్యాం. నాకు వెన్నులోంచి వణుకు వచ్చింది. ఎమర్జెన్సీ తలుపులు తెరుచుకున్నాక మేము స్లైడ్స్ పై జారుతూ కిందకు దిగేశాం’’ అని ఓ ప్రయాణికురాలు తన అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. అయితే, ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


More Telugu News