సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఎందుకు ఆలస్యమవుతోందంటే..!

  • పోస్టులు, చాట్స్, ఈ-మెయిల్స్ గురించి తెలిస్తే కేసు కొలిక్కి
  • 2021లోనే టెక్ సంస్థలకు సీబీఐ అధికారిక అభ్యర్థన
  • ఈ కేసుకు ముగింపు ఇచ్చేందుకు ఈ వివరాలు ఉపయోగపడవచ్చు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కారణాలపై స్పష్టత రాలేదు. అయితే ఆయన తొలగించిన పోస్టులు, చాట్స్, ఈ-మెయిల్స్ గురించి తెలిస్తే ఈ కేసు కొలిక్కి రావొచ్చునని దర్యాఫ్తు అధికారులు భావిస్తున్నారు. వాటిని తిరిగి పొందేందుకు టెక్ సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్ కు 2021లోనే సీబీఐ అధికారిక అభ్యర్థన పంపిందని వార్తలు వచ్చాయి. నాటి నుండి ఆ దిగ్గజ సంస్థల సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా సంస్థల స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామని, పెండింగ్ లో ఉన్న ఈ కేసుకు లాజికల్ గా ఒక ముగింపు ఇచ్చేందుకు ఆ సమాచారం ఉపయోగపడవచ్చునని దర్యాఫ్తు సంస్థ అధికారి ఒకరు జాతీయ మీడియా సంస్థతో అన్నారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సుశాంత్ మృతి కేసుపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజునే ఈ వార్త వెలుగులోకి రావడం గమనార్హం. ఈ కేసులో తొలుత ఉన్న సమాచారం వాళ్లు వీళ్లు చెప్పిన మాటల ఆధారంగా ఉందని, కానీ ఆ తర్వాత కొంతమంది ఈ కేసుకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారని, దీనికి సంబంధించి తాము చర్యలు చేపట్టామని ఫడ్నవీస్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరామని, ప్రాథమిక సాక్ష్యాలు సేకరించామని, ప్రస్తుతం వాటి విశ్వసనీయతను అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. దర్యాఫ్తు కొనసాగుతోందని, ఈ దశలో తాను కేసు గురించి ఏం చెప్పలేనన్నారు.


More Telugu News