అవిశ్వాస తీర్మానం శక్తి.. ప్రధానిని సభకు రప్పించింది: అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై దుమారం
- అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో కొనసాగుతున్న చర్చ
- కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన తమకు లేదన్న అధిర్ రంజన్
- పార్లమెంటుకు మోదీ హాజరు కావాలని అడిగామని వెల్లడి
- అధిర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం
- ప్రధాని అత్యున్నత అథారిటీ అని, అధిర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మూడు రోజులుగా లోక్‌సభలో చర్చ జరుగుతోంది. చర్చలో పాల్గొనేందుకు ఈ రోజు సభకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధానిపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
‘‘అవిశ్వాస తీర్మానానికి ఉన్న శక్తి.. ప్రధానిని పార్లమెంటుకు వచ్చేలా చేసింది. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన మాకు లేదు. పార్లమెంటుకు మోదీ హాజరు కావాలని, మణిపూర్‌లో జరిగిన హింసపై మాట్లాడాలని మాత్రమే అడిగాం. సభకు బీజేపీ సభ్యులు రావాలని మేం అడగలేదు. కేవలం మన ప్రధాని హాజరుకావాలని కోరాం అంతే” అని వివరించారు.
దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అవిశ్వాస తీర్మానం.. ప్రధానిని సభకు వచ్చేలా చేసిందంటూ అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ప్రధాని అత్యున్నత అథారిటీ అని, అధిర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, అధిర్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.