నుహ్ మత ఘర్షణల నిందితుడు, గో రక్షకుడు బిట్టూ అరెస్ట్.. చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు.. వీడియో ఇదిగో!

  • నుహ్ సహా హర్యానాలోని పలు ప్రాంతాల్లో గత నెలలో మత ఘర్షణలు
  • 20 రోజుల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు
  • బిట్టూ బజరంగ్ దళ్ కార్యకర్త
గురుగ్రామ్‌లోని నుహ్‌లో గత నెలలో రేకెత్తిన మత ఘర్షణల కేసులో బజరంగ్‌దళ్‌కు చెందిన గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్టూ బజరంగీతోపాటు బజరంగ్‌దళ్ కార్యకర్త మోను మనేసర్ చేసిన కామెంట్ల కారణంగానే మతకలహాలు చెలరేగినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలు జరిగిన 20 రోజుల తర్వాత ఫరీదాబాద్ సమీపంలో అతడిని అరెస్ట్ చేశారు. 

ఇందుకు సంబంధించి సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సివిల్ డ్రెస్సుల్లో తుపాకులు, చేతిలో కర్రలతో ఉన్న పోలీసులు ఛేజింగ్ అనంతరం నిందితుడిని పట్టుకున్నారు. అల్లర్లు రేకెత్తించడం, హింస, బెదిరింపులు, ప్రభుత్వ పనికి అడ్డంకులు సృష్టించడం, ప్రభుత్వాధికారిని విధుల్లో అడ్డుకుని ఆయుధంతో దాడిచేయడం వంటి ఆరోపణలు నిందితుడు ఎదుర్కొంటున్నాడు.


More Telugu News