మళ్లీ బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన పొంగులేటి ముఖ్య అనుచరుడు
- పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరిన తెల్లం వెంకట్రావు
- మళ్లీ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడి
- భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని వ్యాఖ్య
ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెంకట్రావు తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని తాను నమ్ముతున్నానని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తాను కాంగ్రెస్ అభ్యర్థిపై స్వల్ప మెజార్టీతో ఓడిపోయానని చెప్పారు. పొంగులేటి ప్రధాన అనుచరుడిగానే తాను కాంగ్రెస్ లో చేరానని.. అయితే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక మళ్లీ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తనతో పాటు వచ్చిన కార్యకర్తలకు కూడా బీఆర్ఎస్ లో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే బీఆర్ఎస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.