ఆసియా కప్‌ కోసం నిప్పులపై నడుస్తూ ట్రైనింగ్ తీసుకుంటున్న బంగ్లా క్రికెటర్

  • మైండ్ ట్రైనర్ సహాయం తీసుకున్న బంగ్లా క్రికెటర్ నయీమ్
  • వీడియోను షేర్ చేసి బంగ్లా టీమ్ మేనేజర్
  • ఈ నెల 30 నుంచి జరగనున్న ఆసియా కప్
ప్రధాన టోర్నమెంట్లు వస్తుంటే క్రికెటర్లు ముందుగానే సన్నాహకాలు మొదలు పెడతారు. ప్రత్యర్థి జట్లు, ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ నెల చివర్లో పాకిస్థాన్, శ్రీలంక వేదికగా మొదలయ్యే ఆసియా కప్ కోసం ఆయా జట్ల క్రికెటర్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. ఈ టోర్నీ కోసం బంగ్లాదేశ్ క్రికెటర్ మొహమ్మద్ నయీమ్ అనూహ్య పద్ధతిలో సన్నద్ధం అవుతున్నాడు. ఆసియా కప్ ముంగిట అతను మైండ్ ట్రైనర్ సహాయం తీసుకుంటున్నాడు. ట్రెయినింగ్‌లో భాగంగా ఓ ఫుట్ బాల్ మైదానంలో నయూమ్‌ నిప్పులపై నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్‌‌ ట్విట్టర్ లో షేర్ చేశాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు బంగ్లా క్రికెటర్ సన్నద్ధత వెరైటీగా ఉందని అంటున్నారు. మరికొందరేమో అతను పిచ్చిపనులు చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే, నిప్పులపై నడవడం ద్వారా మెదడు చురుగ్గా మారి, భయం పోతుందని, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బంగ్లా క్రికెట్ టీమ్ మేనేజర్‌‌ ఓ ఆర్టికల్‌ను తన ట్విట్టర్‌‌లో షేర్ చేశాడు. కాగా, ఈ నెల 30న జరిగే ఆసియా కప్ తొలి మ్యాచ్‌ లో పాకిస్థాన్ జట్టు నేపాల్ తో పోటీ పడనుంది.


More Telugu News