పార్టీ మారడమా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది: స్టేషన్‌ఘన్‌పూర్‌‌ ఎమ్మెల్యే రాజయ్య

  • ఇప్పటికీ కేసీఆర్‌‌పై నమ్మకం ఉందని, టికెట్ తనకే వస్తుందని ధీమా 
  • ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు ఇస్తామని అంటున్నారని వెల్లడి
  • తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నానని వ్యాఖ్య 
స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే రాజయ్య.. పార్టీ మార్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడమా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. అయితే ఇప్పటికీ కేసీఆర్‌‌పై నమ్మకం ఉందని, టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు

తనకు టికెట్ రాకున్నా మాదిగ జాతి తనతోనే ఉందని చెప్పారు. తన రాజకీయ జీవితం ఎమ్మార్పీఎస్ నుంచి మొదలైందని అన్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి మాదిగ జాతి ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగల పాత్ర కీలకమని చెప్పారు. మాదిగల అస్థిత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్‌‌ది అని అన్నారు. 

ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు ఇస్తామని అంటున్నారని, కానీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నానని రాజయ్య తెలిపారు. ఒకవేళ టికెట్ రాకుంటే ఏం చేయాలనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. తనకు టికెట్ రాకపోవడంపై మాదిగలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి మద్దతు తెలుపుతున్నారని వివరించారు.


More Telugu News