గగన్ యాన్ టీవీ డీ 1 ప్రయోగం విజయవంతం

  • 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన మిషన్
  • తిరిగి సేఫ్ గా సముద్రంలో ల్యాండింగ్
  • గగన్ యాన్ ప్రాజెక్ట్ లో ఇది కీలక సన్నాహక పరీక్ష అన్న ఇస్రో చైర్మన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 (టెస్ట్ వెహికల్ డెమాన్ స్ట్రేషన్ 1) ను శనివారం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. క్రూ మాడ్యుల్ ప్రయోగంలో భాగంగా సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ను నింగిలోకి పంపింది. తొలుత ఈ ప్రయోగాన్ని శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. అయితే, చివరి క్షణంలో సాంకేతిక లోపంతో మిషన్ ఆగిపోయింది. అనంతరం లోపాన్ని గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు దానిని సవరించి షెడ్యూల్ టైమ్ కు రెండు గంటలు ఆలస్యంగా ప్రయోగం నిర్వహించారు. గగన్ యాన్ ప్రాజెక్టులో అనూహ్య పరిస్థితులు ఎదురైతే ప్రయోగాన్ని రద్దు చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ ప్రయోగం లక్ష్యమని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ 17 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ‘అబార్ట్’ సంకేతం పంపారు. దీంతో రాకెట్ లోని క్రూ ఎస్కేప్ వ్యవస్థ యాక్టివేట్ అయింది. రాకెట్ నుంచి విడివడి పారాచూట్ సాయంతో సముద్రంలో ల్యాండ్ అయింది. ప్రయోగం ఆద్యంతం అనుకున్నట్లుగానే కొనసాగిందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ వివరించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ అభినందనలు తెలిపారు.



More Telugu News