కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ఆనుమానం ఉండేది: మంత్రి కేటీఆర్

  • సోమాజిగూడలో ఓ హోటల్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీ
  • తెలంగాణ ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా ఉందన్న మంత్రి
  • తొమ్మిదిన్నరేళ్లలో చూసిన అభివృద్ధి ట్రయలర్ మాత్రమేనని వ్యాఖ్య
  • పది నిమిషాలు కరెంట్ పోతే ఇదేనా బంగారు తెలంగాణ? అని అడుగుతున్నారన్న కేటీఆర్
పదేళ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు వీరికి పరిపాలన సాధ్యమవుతుందా? అని ఎన్నో అనుమానాలు ఉండేవని, ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమాజిగూడలోని ఓ హోటల్లో నగరానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ తొమ్మిదిన్నరేళ్లలో చూసింది కేవలం ట్రయలర్ మాత్రమేనని, మూడోసారి అధికారంలోకి వచ్చాక అయిదేళ్లలో 24 గంటలు తాగునీరు సదుపాయం కల్పిస్తామన్నారు.

పదేళ్ల క్రితం పది రోజులు కరెంట్ పోయినా అడిగేవారు లేరని, ఇప్పుడు పది నిమిషాలు పోతేనే... ఇదేనా బంగారు తెలంగాణ? అని అడుగుతున్నారన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి తాము ఐదు గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ ఇక్కడ తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న విషయం మరిచిపోయారన్నారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.

కేటీఆర్‌కు పారిశ్రామికవేత్తల విజ్ఞప్తి

కొత్త పరిశ్రమలకు ఇచ్చినట్లుగా పాత పరిశ్రమలకు కూడా రాయితీలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ను పలువురు పారిశ్రామికవేత్తలు కోరారు. మళ్లీ బీఆర్ఎస్ రావాలని, ఆ తర్వాత మన డిమాండ్లను నెరవేర్చుకోవాలని పారిశ్రామికవేత్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీ నడపడం గతంలో కంటే సులభమైందన్నారు. పారిశ్రామికరంగం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ మూడోసారి సీఎం కావాలన్నారు. తగినంత విద్యుత్ అందుబాటులో ఉండటం వల్లే పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడిందన్నారు.


More Telugu News