కాల్వలో పడిపోయిన 108 వాహనం..రోగిని తరలిస్తుండగా ఘటన

  • అమృతలూరు మండలం పెదపూడి వంతెన వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘటన
  • మంచు కారణంగా వంతెన మలుపు వద్ద డ్రైవర్‌కు దారి కనిపించకపోవడంతో ప్రమాదం
  • వాహనం అదుపుతప్పి కాల్వలో పడ్డ వైనం, వాహనంలోని వారికి స్వల్ప గాయాలు
  • మరో 108 వాహనంలో బాధితులను తెనాలి ఆసుపత్రికి తరలింపు
రోగిని తరలిస్తున్న ఓ 108 వాహనం ఆదివారం కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనంలోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. అమృతలూరు మండలం పెదపూడి వంతెన మలుపు వద్ద ఆదివారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. 

నిజాం పట్నం మండలం గోకర్ణమఠం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి, మరో ముగ్గురు సహాయకులతో 108 వాహనం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు ప్రయాణిస్తోంది. వేకువజామున మంచు ఎక్కువగా ఉండటంతో పెదపూడి వంతెన మలుపులో డ్రైవర్‌కు మార్గం కనిపించలేదు. దీంతో, వాహనం అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. 

డ్రైవర్ వెంటనే ఈ విషయాన్ని అమృతలూరు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో మరో 108 వాహనం ద్వారా బాధితులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం, క్రేన్ సాయంతో కాలువ నుంచి వాహనాన్ని బయటకు తీశారు.


More Telugu News