కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది: కేటీఆర్

  • కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పని చేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారన్న కేటీఆర్
  • పదేళ్లలో ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇస్తే ఏమీ ఇవ్వలేదని ప్రచారం చేశారని ఆగ్రహం
  • చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్న కేటీఆర్
  • పనుల మీద కంటే ప్రచారం మీద దృష్టి పెడితే గెలిచేవాళ్లమని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఓడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనం పనుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పని చేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో తాము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని... కానీ ఆరు లక్షలకు పైగా కార్డులు ఇచ్చామని వెల్లడించారు.

దేశంలో అత్యధిక ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వేతనాలను 73 శాతం వరకు పెంచామన్నారు. 29 లక్షల పెన్షన్లను 46  లక్షలకు పెంచినట్లు తెలిపారు. అయితే వీటిని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ప్రజలను ఎప్పుడూ క్యూలైన్లలో నిలబెట్టలేదన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల సౌకర్యం కోసం చూసిందే తప్ప రాజకీయ ప్రయోజనం కోసం ఆలోచించలేదన్నారు. అయినా ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదన్నారు. మూడోవంతు సీట్లను గెలుచుకున్నామని గుర్తు చేశారు. 14 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయామన్నారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌కు ఓట్ల తేడా కేవలం 1.85 శాతమేనని చెప్పారు.

స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ... లోక్ సభ వరకు బీఆర్ఎస్‌కు బలమైన నాయకత్వం ఉందని కేటీఆర్ అన్నారు. అన్నింటికి మించి మనకు కేసీఆర్ వంటి నేత ఉన్నారని పేర్కొన్నారు. ఎవరూ నిరుత్సాహపడవద్దని... అందరినీ కలుపుకొని ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలను చేపడదామని తెలిపారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు... పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అందించినా ఆ ప్రాంతాల్లో ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వలేదన్నారు.


More Telugu News