అమెరికాలో నానాటికీ దిగజారుతున్న ఉద్యోగుల పరిస్థితి.. 1000 మంది ఉద్యోగులపై 'ఈబే' వేటు

  • అమెరికాలో కత్తిమీద సాములా మారిన ఉద్యోగాలు
  • పెరిగిన ఖర్చులు, వేతనాలను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులపై వేటు
  • సంస్థాగత మార్పుల్లో భాగంగానే తీసివేతలన్న ఈబే
అమెరికాలో ఉద్యోగాలు కత్తిమీద సాములా తయారయ్యాయి. ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమెరికాలో గతేడాది ఉద్యోగుల తొలగింపు 98 శాతానికి చేరుకుందని, ఈ ఏడాది అది మరింత దిగజారుతుందన్న నివేదిక వెలువడిన మరుసటి రోజే యూఎస్ ఈ-కామర్స్ దిగ్గజం ఈబే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. తమ మొత్తం ఉద్యోగుల్లో 9 శాతం అంటే దాదాపు 1000 మందిని ఇంటికి పంపాలని నిర్ణయించింది. వ్యాపార వ్యూహాలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
 
ఈ మేరకు సంస్థ సీఈవో జామీ ఇయానోన్ ఉద్యోగులకు లేఖ రాశారు. ఖర్చుల పెరుగుదల, ఉద్యోగుల వేతనాలు, కంపెనీ వ్యవహారాల ఖర్చులు వ్యాపారానికి మించి ఉండడం వల్ల దానిని పరిష్కరించేందుకు, ఎండ్ టు ఎండ్ అనుభవాన్ని పెంచడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చేందుకు సంస్థాగత మార్పులు అమలు చేస్తున్నట్టు తెలిపారు.


More Telugu News