భారత్‌లో దారుణమైన మార్కెట్లు ఇవే.. ప్రకటించిన అమెరికా

  • నకిలీ ఉత్పత్తుల మార్కెట్ల జాబితాను విడుదల చేసిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ విభాగం
  • తొలి స్థానంలో నిలిచిన చైనా మార్కెట్లు
  • ముంబై, ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లతో పాటూ మరో 3 ఆన్‌లైన్ మార్కెట్లకు జాబితాలో చోటు
ప్రపంచవ్యాప్తంగా నకిలీ ఉత్పత్తులకు కేంద్రంగా మారిన మార్కెట్లతో ఓ జాబితాను రూపొందించిన అమెరికా ప్రభుత్వం ఈ లిస్టులో భారత్‌లో ఉన్న ఆరు మార్కెట్లను కూడా చేర్చింది. ఈ మార్కెట్లలో ట్రేడ్ మార్క్, కాపీరైట్ ఉల్లంఘనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, నకిలీ, పైరేటెడ్ ఉత్పత్తులు లభ్యమవుతున్నాయని వెల్లడించింది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ విభాగం రూపొందించిన ఈ జాబితాలో హీరా పన్నా (ముంబై), టాక్ రోడ్‌లోని మార్కెట్ (న్యూఢిల్లీ), సదర్ ప్రతప్ప రోడ్ మార్కెట్ (బెంగళూరు)‌తో పాటూ ఆన్‌లైన్ మార్కెట్లైన ఇండియామార్ట్, వేగామూవీస్, డబ్ల్యూహెచ్ఎమ్‌సీఎస్ మార్కెట్లు ఉన్నాయి. 2023 జాబితాలో మొత్తం 39 ఆన్‌లైన్ మార్కెట్లు, 33 ఫిజికల్ మార్కెట్లు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ జాబితాలోనూ చైనా మార్కెట్లు తొలిస్థానంలో నిలిచాయి. 

న్యూఢిల్లీలోని టాంక్ రోడ్డులోని హోల్‌సేల్ మార్కెట్‌ వస్త్రాలకు పాప్యులర్. ఇక్కడ డెనిమ్ వస్త్రాలు అసంఖ్యాకంగా లభ్యమవుతాయి. బెంగళూరులోని సదర్ ప్రతప్పరోడ్ మార్కెట్‌ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఫేమస్. ఇక్కడ హార్డ్‌వేర్, మెషీన్ టూల్స్ కూడా లభ్యమవుతాయి. అయితే, ఈ మార్కెట్ నకిలీ ఉత్పత్తులకు అడ్డాగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇక ముంబైలోని హీరా పన్నా మార్కెట్‌లో గ్లోబల్ బ్రాండ్స్‌కు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తాయి. కొత్త ఉత్పత్తుల నకళ్ల కోసం వినియోగదారులు ఈ మార్కెట్‌కు క్యూ కడుతుంటారు. కాగా, హీరాపన్నా, టాంక్ రోడ్డు మార్కెట్లు గతంలోనూ ఈ జాబితాకెక్కాయి. 

నకిలీ ఉత్పత్తులతో వాణిజ్యానికి ప్రమాదం పొంచి ఉందని అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి కేథరిన్ టాయ్ పేర్కొన్నారు. వీటితో వర్కర్లు, వినియోగదారులు, చిన్న వ్యాపారాలకు అపార నష్టం ఉందన్నారు. అంతిమంగా వీటితో అమెరికా ఆర్థికరంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు.


More Telugu News