భారత్ విషయంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చెప్పేది పచ్చిఅబద్దం.. ఆ దేశ మాజీ మంత్రి వ్యాఖ్యలు

  • మాల్దీవులలో 3 వేల మంది భారత సైనికులు ఉన్నారన్నది అబద్ధమన్న విదేశాంగ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్
  • విదేశీ సాయుధ సైనికులు ఎవరూ దేశంలో లేరని వ్యాఖ్య
  • ‘మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ’ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఎక్స్ వేదికగా షాహిత్ స్పందన
తమ దేశంలో వేలాది మంది భారతీయ సైనికులు ఉన్నారంటూ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ అన్నారు. అధ్యక్షుడు చెప్పిన అసత్యాలలో ఇదొకటని వ్యాఖ్యానించారు. తమ దేశంలో విదేశీ సాయుధ సైనికులు ఎవరూ లేదని షాహిద్ అన్నారు. ‘మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సరైన గణాంకాలను కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. ప్రభుత్వం పారదర్శకత పాటించడం ముఖ్యమని, సత్యమే గెలుస్తుందని షాహిత్ వ్యాఖ్యానించారు.

కాగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మాల్దీవుల నుంచి భారత దళాలను పంపించి వేస్తామని అధ్యక్షుడు ముయిజ్జు నాయకత్వంలోని పార్టీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజునే బలగాలను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని ముయిజ్జు కోరిన విషయం తెలిసిందే. నిజానికి మాల్దీవులలో భారత సైనికులు ఎక్కువ సంఖ్యలో లేరు. ‘డోర్నియర్ 228 సముద్ర గస్తీ విమానం, రెండు హెచ్ఏఎల్ ధృవ్ హెలికాప్టర్లు, సుమారు 70 మంది భారత సైనికులు మాత్రమే అక్కడ ఉన్నట్టుగా రిపోర్టులు పేర్కొంటున్నాయి.


More Telugu News