రైతుల‌కు పెట్టుబ‌డి రాయితీ విడుద‌ల చేసిన సీఏం జ‌గ‌న్‌

  • 11.59 ల‌క్ష‌ల మంది రైత‌న్న‌ల ఖాతాల‌లో  రూ.1294.58 కోట్ల జ‌మ‌
  • రైతులు న‌ష్ట‌పోకూడ‌ద‌నేదే త‌మ ప్ర‌భుత్వం ల‌క్ష్య‌మ‌న్న‌ సీఏం జ‌గ‌న్ 
  • సాగుచేసిన ప్ర‌తి ఎక‌రా కూడా ఇ-క్రాప్ కింద న‌మోదు
  • 3.25ల‌క్ష‌ల టన్నుల త‌డిసిన ధాన్యాన్ని కొన్న‌ట్లు వెల్ల‌డి
  • ఉచిత బీమా కింద రైత‌న్న‌ల‌కు రూ. 7802 కోట్ల చెల్లింపు
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రైతుల‌కు పెట్టుబ‌డి రాయితీల‌ను విడుద‌ల చేశారు. మిచాంగ్ తుపాన్‌తో పాటు ఇత‌ర విప‌త్తుల కార‌ణంగా గ‌తేడాది న‌ష్ట‌పోయిన సుమారు 11.59 ల‌క్ష‌ల మంది రైత‌న్న‌ల ఖాతాల‌కు రూ.1294.58 కోట్ల పంట న‌ష్ట‌ప‌రిహారాన్ని బుధ‌వారం సీఏం జ‌గ‌న్ తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి బ‌ట‌న్ నొక్కి జ‌మ చేయ‌డం జ‌రిగింది. 

అనంత‌రం ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. ఖ‌రీఫ్ వ‌ర్షాభావం వ‌ల్ల‌, మిచాంగ్ తుపాన్ కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు సీజ‌న్ ముగిసేలోగా రైత‌న్న‌ల‌కు తోడుగా, అండ‌గా త‌మ ప్ర‌భుత్వం ఉంటుంద‌ని చెప్పారు. రైతులు న‌ష్ట‌పోకూడ‌ద‌నేదే త‌మ ప్ర‌భుత్వం ల‌క్ష్య‌మ‌ని సీఏం జ‌గ‌న్ వెల్ల‌డించారు.  

సాగుచేసిన ప్ర‌తి ఎక‌రా కూడా ఇ-క్రాప్ కింద న‌మోదు చేస్తున్నామ‌న్నారు. అవినీతికి, వివ‌క్ష‌కు తావులేకుండా పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌తి రైతుకు అందాల్సిన స‌హాయాన్ని స‌కాలంలో అందిస్తున్నామ‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని, విపత్తుల కార‌ణంగా త‌డిసిన ధాన్యాన్ని కూడా కొన‌గోలు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఏకంగా 3.25ల‌క్ష‌ల టన్నుల త‌డిసిన ధాన్యాన్ని కొన్న‌ట్లు చెప్పారు. 

వ‌ర్షాభావం, తుపాన్ కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు దాదాపు రూ.1300 కోట్లు ఇన్‌పుట్ స‌బ్సిడీ కింద ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అంతేగాక మొట్ట‌మొద‌టి సారిగా ఈ 58 నెల‌ల కాలంలో ఉచిత బీమా కింద రూ. 7802 కోట్లు రైత‌న్న‌ల‌కు చెల్లించామ‌న్నారు. ఇక రాష్ట్రంలో 63శాతం మంది రైతుల‌కు అర హెక్టారు క‌న్నా త‌క్కువ భూమి మాత్ర‌మే ఉంద‌ని, 87 శాతం మందికి హెక్టారులోపే భూమి ఉందంటూ చెప్పుకొచ్చారు. విపత్తుల వ‌ల్ల రైతులు న‌ష్ట‌పోకూడ‌ద‌నేది త‌మ ప్ర‌భుత్వం ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా వెంట‌నే స్పందించి వారికి తాము తోడుగా ఉన్నామ‌నే భోరోసా క‌ల్పిస్తున్న‌ట్లు సీఏం జ‌గ‌న్ వెల్ల‌డించారు.


More Telugu News