భారత్‌తో సయోధ్యకు వచ్చిన మాల్దీవులు.. అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు

  • రుణ విముక్తిలో భారత్ సాయం కోరిన మాల్దీవులు
  • భారత్ సన్నిహిత భాగస్వామ్య దేశమన్న అధ్యక్షుడు ముయిజ్జు
  • ఇండియా మైత్రి విషయంలో సందేహం లేదని వ్యాఖ్య
  • అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు
ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్‌తో సయోధ్యకు వచ్చారు. గతేడాది నవంబర్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న ఆయన తాజాగా రుణ సాయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల రుణ విముక్తిలో భారత్ అండగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మాల్దీవులకు భారత్ సన్నిహిత భాగస్వామ్య దేశంగా కొనసాగుతుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని మహ్మద్ ముయిజ్జు అన్నారు. మాల్దీవులకు సాయం అందించడంలో ఇండియా కీలకపాత్ర పోషిస్తోందని, ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసిందని ఆయన ప్రస్తావించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక మీడియా సంస్థ ‘మిహారు’కు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ విషయంలో ఆయన స్వరాన్ని మార్చుకోవడం ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపించింది. 

భారీ రుణాల చెల్లింపులో మాల్దీవులకు ఉపశమన చర్యలు కల్పించాలని భారత్‌ను కోరారు. వారసత్వంగా కొనసాగుతున్న విధానంలో భారత్ నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో రుణాలు పొందామని, ఈ రుణాల చెల్లింపులో మినహాయింపుల కోసం ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఇప్పటికే దేశంలో కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లను నిలిపివేయడానికి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు లేవని అన్నారు. మాల్దీవులు-భారత్ సంబంధాలను నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు.

కాగా గతేడాది చివరి నాటికి మాల్దీవులు భారత్‌కు సుమారు 400.9 మిలియన్‌ డాలర్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఇక 2023 నవంబర్‌లో దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మహ్మద్ ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నారు. చైనా అనుకూల ధోరణిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.


More Telugu News