ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి పొంగులేటి

  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటన
  • స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • రూ. 22 కోట్లతో పాలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తానని వెల్లడి
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో సోమవారం ఆయన పర్యటించారు. స్థానికులను అడిగి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. 

ఆ తర్వాత అక్కడే స్థానికులతో మంత్రి సమావేశం అయ్యారు. పాలేరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. 

ముఖ్యంగా పాలేరులోని అన్ని గ్రామాల్లో ఏడాదిలోగా సీసీరోడ్లు పూర్తి చేస్తానని చెప్పారు. అలాగే రూ. 22.5 కోట్లు ఖర్చుపెట్టి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరడంతో రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలోని పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని ఆయన గుర్తుచేశారు. అలాగే అర్హులైన వారికి ఆసరా పెన్షన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అయినా ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఇంకా అహంకారం వీడట్లేదని దుయ్యబట్టారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


More Telugu News