70 ఏళ్ల వయసులో కిడ్నీ దానం చేసి.. మనవడి ప్రాణం కాపాడిన బామ్మ!

  • మధ్యప్రదేశ్‌లోని జబ‌ల్‌పూర్‌లో ఘ‌ట‌న‌
  • 23 ఏళ్ల మ‌న‌వ‌డికి కిడ్నీ దానం చేసిన 70 ఏళ్ల బామ్మ
  • కిడ్నీ మార్పిడి ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన జబ‌ల్‌పూర్‌ మెట్రో ఆసుప‌త్రి వైద్యులు 
  • ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. మనవడు, బామ్మ ఇద్ద‌రూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుల వెల్ల‌డి
70 ఏళ్ల వృద్ధురాలు తన మనవడికి కిడ్నీని దానం చేసి అతడి ప్రాణాలు కాపాడింది. 23 ఏళ్ల మ‌న‌వ‌డి కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడంతో ఆ వృద్ధురాలి మనసు తల్లడిల్లిపోయింది. అంత వయసులోనూ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ మనవడికి కిడ్నీ ఇచ్చి కాపాడుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబ‌ల్‌పూర్‌లో జరిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. జబ‌ల్‌పూర్‌లోని సిహోరాకు చెందిన 23 ఏళ్ల యువకుడు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత‌ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతడి రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో అత‌డు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవాడు. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా లాభం లేకపోయింది. ఈ క్రమంలో యువకుడికి కిడ్నీ మార్పిడి చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని వైద్యులు తెలిపారు. దాంతో యువకుడి కుటుంబ స‌భ్యులు అత‌నికి స‌రిపోయే కిడ్నీ కోసం అన్వేషణ ప్రారంభించారు.

ఈ క్ర‌మంలో యువకుడు, బామ్మ బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని రక్త పరీక్షల్లో తేలింది. అలాగే వారిద్దరికీ వైద్యులు రక్త, ఇతర పరీక్షలు చేశారు. దీంతో పాటు బామ్మ ఆరోగ్యాన్ని పరీక్షించారు. అదే స‌మ‌యంలో యువకుడికి బామ్మ కిడ్నీ మ్యాచ్ అయ్యింది. అప్పుడు జబ‌ల్‌పూర్‌ మెట్రో ఆసుప‌త్రి వైద్యులు విశాల్ బదేరా, రాజేశ్ పటేల్ ఆపరేషన్ చేసి బామ్మ కిడ్నీని మనవడికి అమర్చారు. ఆపరేషన్ విజ‌య‌వంతం కావడంతో ప్రస్తుతం మనవడు, బామ్మ ఇద్ద‌రూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్ల‌డించారు.

కాగా, కిడ్నీ మార్పిడి అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైనప్పటికీ ఇంత పెద్ద వయసులో ప్రాణాన్ని పణంగా పెట్టి బామ్మ కిడ్నీ దానం చేయడం గ‌మ‌నార్హం. వృద్ధురాలి శరీరం నుంచి కిడ్నీని తొలగించడం ఆరోగ్యపరంగా చాలా తీవ్రమైన విషయం. దాంతో వైద్యులు ఒక నెల మొత్తం బామ్మ శారీరక సామర్థ్యాన్ని పరిశీలించ‌డం జ‌రిగింది. ఆ తర్వాతే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వ‌హించారు.


More Telugu News