పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ!

  • సింధూకు మూడోసారి ఒలింపిక్స్ పతకం గెలిచే అవకాశం చేజారిన వైనం
  • చైనా క్రీడాకారిణి బిన్‌జియావో చేతిలో 19-21, 14-21తో ఓటమి
  • తొలి గేమ్ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సింధూ వ్యాఖ్య
రియో ఒలింపిక్స్‌లో రజతం.. టోక్యోలో కాంస్యంతో యావత్ దేశం గర్వపడేలా చేసిన బాడ్మింటన్ సంచలనం పీవీ సింధూకు ఈమారు ఒలింపిక్స్‌లో నిరాశే ఎదురైంది. హ్యాట్రిక్ అంచనాలతో బరిలోకి దిగిన ఆమె ఓటమితో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్వార్టర్స్‌కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సింధూ.. చైనా క్రీడాకారిణి హే బిన్‌జియావో చేతిలో 19-21, 14-21తో ఓటమి చవిచూసింది. 

తొలి నుంచి చైనా అమ్మాయి ఆటపై పట్టు నిలుపుకుంటూ సింధూపై ఒత్తిడి పెంచింది. తొలి గేమ్‌లో గెలిచే అవకాశం చేజార్చుకున్న సింధు ఆ తరువాత పుంజుకోలేకపోయింది. మ్యాచ్ ఆరంభంలోనే ఒత్తిడికి లోనైన సింధూ 1-5తో వెనకబడింది. ఆ తరువాత పుంజుకుని ప్రత్యర్థితో అంతరాన్ని 10-11కు తగ్గించింది. అనంతరం, చైనా క్రీడాకారిణి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో సింధూ కోలుకోలేకపోయింది. ఓ దశలో 19-19తో సింధూకు లభించిన అవకాశం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ ఛాన్స్‌ను ప్రత్యర్థి పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. రెండో గేమ్‌లో కూడా బిన్‌జియావో విజృంభించడంతో సింధూకు ఓటమి తప్పలేదు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ ఇదే బిన్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని సాధించడం గమనార్హం. 

దేశానికి మూడో ఒలింపిక్స్ పతకం అందించే అవకాశం చేజారడంపై సింధూ నిరాశ వ్యక్తం చేసింది. తొలి గేమ్‌లో గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యానించింది. తొలి గేమ్ గెలిచిన కాన్ఫిడెన్స్‌తో ఫలితం మరోలా ఉండి ఉండేదని చెప్పింది.


More Telugu News