బంగ్లాదేశ్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం: కేంద్రం

  • బంగ్లాదేశ్ లో హింసాత్మకంగా రిజర్వేషన్ కోటా నిరసనలు
  • ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా
  • నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం
బంగ్లాదేశ్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం: కేంద్రం
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోటా నిరసనలు హింసాత్మక రూపుదాల్చి, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ లో తలదాచుకోవాల్సి వచ్చిన నేపథ్యంలో... భారత కేంద్ర ప్రభుత్వం నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. 

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. పొరుగుదేశం బంగ్లాదేశ్ లో పరిణామాలను కేంద్రం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. బంగ్లాదేశ్ లో ఉంటున్న భారత పౌరుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అన్ని పార్టీల ప్రతినిధులకు వివరించినట్టు వెల్లడించారు. బంగ్లాదేశ్ అంశంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు అన్ని పార్టీల నుంచి ఏకగ్రీవంగా మద్దతు లభించిందని జైశంకర్ ఓ ట్వీట్ లో తెలిపారు. 

బంగ్లాదేశ్ లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిలో అత్యధిక శాతం మంది విద్యార్థులేనని జైశంకర్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికతో 8 వేల మంది విద్యార్థులు స్వదేశానికి తిరిగొచ్చారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ సైన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అక్కడ చోటుచేసుకుంటున్న మార్పులపై సమాచారం సేకరించి, ఆ మేరకు తదుపరి ప్రకటన చేస్తామని వివరించారు. 

కాగా, నేటి అఖిలపక్ష సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, డీఎంకే నేత టీఆర్ బాలు, సమాజ్ వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ్, బీజేడీ నేత సస్మిత్ పాత్రా, ఇతర పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.


More Telugu News