కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు... రబీకి నీళ్లు కష్టమేనన్న కర్ణాటక డిప్యూటీ సీఎం

  • ఆదివారం కొట్టుకుపోయిన గేటును పరిశీలించిన డీకే శివకుమార్
  • డ్యామ్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఖరీఫ్‌కు మాత్రమే నీరు అందిస్తామన్న శివకుమార్
  • రబీకి నీరు అందించడం కష్టం కాబట్టి రైతులు సహకరించాలని విజ్ఞప్తి
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో... ఈ ఏడాది ఖరీఫ్ పంటకు నీరు అందేలా చూస్తామని, రబీ పంటకు మాత్రం నీరు అందించడం కష్టమేనని... కాబట్టి రైతులు సహకరించాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో ఆయన ఆదివారం డ్యాంను పరిశీలించారు. గేటు ధ్వంసం కావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాంకు గేటును బిగించే అంశంపై మాట్లాడారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరమన్నారు. ఈ డ్యామ్ కర్నాటక- ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మూడు రాష్ట్రాలకు వరప్రదాయిని అన్నారు. ఈ డ్యామ్‌లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తే గేటు మరమ్మతులకు అవకాశం ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా గేటును పునరుద్ధరిస్తామన్నారు. కాగా, గేటు మరమ్మతుల కోసం నీటిని కిందకు వదులుతున్నారు. మరో ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.


More Telugu News