హరీశ్ రావును కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

  • హరీశ్ రావు నివాసానికి వెళ్లిన బీఆర్ నాయుడు
  • నాయుడుని శాలువాతో సత్కరించిన హరీశ్ రావు
  • సిద్దిపేటలో టీటీడీ ఆలయ పనులను ప్రారంభించాలని విన్నపం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన బీఆర్ నాయుడు కీలక నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఆయన కలిశారు. హరీశ్ రావు నివాసానికి వెళ్లిన బీఆర్ నాయుడు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడికి హరీశ్ రావు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. బీఆర్ నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... శ్రీవారికి సేవ చేసే భాగ్యం బీఆర్ నాయుడుకి లభించడం అదృష్టమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్ నాయుడిని కోరారు. సిద్దిపేటలో టీటీడీ ఆలయ పనులను త్వరగా ప్రారంభించాలని విన్నవించారు.  

బీఆర్ నాయుడు మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తెలంగాణ నేతల సిఫారసు లేఖలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సిద్దిపేట, కరీంనగర్ లలో టీటీడీ ఆలయ పనులపై బోర్డులో చర్చిస్తామని తెలిపారు.


More Telugu News