బంగాళాఖాతంలో 'ఫెంగల్' తుపాను... కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక

  • నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • నేడు తుపానుగా మారనుందని ఐఎండీ వెల్లడి
  • రేపు కారైక్కాల్-మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తుపానుగా మారిన తర్వాత వాయవ్య దిశగా పయనిస్తూ, రేపు (నవంబరు 30) మధ్యాహ్నానికి కారైక్కాల్-మహాబలిపురం మధ్య తీరం దాటనుంది. ఈ తుపానుకు ఐఎండీ 'ఫెంగల్' అని నామకరణం చేసింది. 

ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. 

కాగా, తుపాను నేపథ్యంలో, ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 


More Telugu News