'పుష్ప-2' టికెట్ల ధర పెంపుపై హైకోర్టులో విచారణ

  • రేపు రాత్రి నుంచి 'పుష్ప-2' బెనిఫిట్ షోలు
  • టికెట్ కు అదనంగా రూ. 800 వసూలు చేస్తున్నారంటూ పిటిషన్
  • తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసిన హైకోర్టు
'పుష్ప-2' సినిమా ఎల్లుండి విడుదలవుతోంది. రేపు రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలు వేయనున్నారు. సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్ కు అదనంగా రూ. 800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. 

తొలి 15 రోజులు టికెట్ పై అధిక ధరలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించామని... అందుకే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని నిర్మాత తరపు లాయర్ చెప్పారు. దీంతో, ప్రభుత్వమే టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించింది కదా? అని పిటిషన్ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. 

టికెట్ రేట్లను పెంచడం వల్ల ప్రజలపై భారం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోలు పెట్టి ప్రేక్షకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. పెంచిన రేట్ల ద్వారా వచ్చే ఆదాయం ఛారిటీలకు, సీఎం, పీఎం సహాయనిధులకు వెళ్లడం లేదని... నిర్మాత లబ్ధి పొందుతున్నారని అన్నారు. 

థియేటర్లలో పాప్ కార్న్, మంచి నీళ్ల బాటిళ్లను కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు కదా? అని న్యాయమూర్తి అడిగారు. బెనిఫిట్ షోకు 10 మంది వెళితే రూ. 8 వేలు అవుతుంది కదా? ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... బెనిఫిట్ షో కేవలం హీరో అభిమానుల కోసమేనని నిర్మాత తరపు న్యాయవాది తెలిపారు. కౌంటర్ వేయడానికి సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను డిసెంబర్ 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 


More Telugu News